సుప్రీంకోర్టులో గూగుల్ పిటిషన్ కొట్టివేత

19-01-2023 Thu 19:14 | National
  • గతంలో గూగుల్ పై సీసీఐ రూ.1,337 కోట్ల జరిమానా
  • అప్పిలేట్ ట్రైబ్యునల్ లోనూ గూగుల్ కు చుక్కెదురు
  • సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైనం
  • నేడు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం
Supreme Court dismisses Google petition
టెక్ దిగ్గజం గూగుల్ పై గతంలో కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.1,337 కోట్ల భారీ జరిమానా విధించడం తెలిసిందే. ఆండ్రాయిడ్ కు సంబంధించి తన ఆధిక్యతను గూగుల్ దుర్వినియోగం చేస్తోందని, కాంపిటీషన్ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ లో గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందని నాడు గూగుల్ పై సీసీఐ ఈ జరిమానా వడ్డించింది. 

దీనిపై గూగుల్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించినా వ్యతిరేక తీర్పు వచ్చింది. ఎన్సీఎల్ఏటీ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన గూగుల్ కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. 

గూగుల్ పిటిషన్ పై సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్సీఎల్ఏటీ తీర్పుపై స్టే కోరుతూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. తిరిగి ఈ కేసును ఎన్సీఎల్ఏటీకి బదలాయించింది. కేసు విచారణకు మార్చి 31 తుది గడువుగా ఎన్సీఎల్ఏటీకి నిర్దేశించింది. అంతేకాదు, గతంలో సీసీఐ విధించిన జరిమానాలో 10 శాతాన్ని వారం రోజుల్లో చెల్లించాలని సుప్రీంకోర్టు గూగుల్ ను ఆదేశించింది.