డ్యాన్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి ముందు బాలీవుడ్ నటి రాఖీకి చేదు అనుభవం

19-01-2023 Thu 14:17 | National
  • రాఖీ సావంత్ ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
  • షెర్లిన్ చోప్రా ఇచ్చిన కేసులో చోటు చేసుకున్న పరిణామం
  • ట్విట్టర్ లో ప్రకటించిన షెర్లిన్ చోప్రా
Rakhi Sawant detained in case filed by Sherlyn Chopra
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. షెర్లిన్ చోప్రా నమోదు చేసిన కేసులో అంబోలీ పోలీసులు రాఖీ సావంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని షెర్లిన్ చోప్రా తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించింది. 

వాస్తవానికి రాఖీ సావంత్, తన భర్త ఆదిల్ దుర్రానీతో డ్యాన్స్ అకాడమీని గురువారం ప్రారంభించాల్సి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈలోపే ఆమెను అంబోలీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. బుధవారం రాఖీ సావంత్ యాంటిసిపేటరీ బెయిల్ అభ్యర్థనను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసినట్టు షెర్లిన్ చోప్రా పేర్కొంది. 

మీటూ నిందితుడు సాజిద్ ఖాన్ కు వ్యతిరేకంగా గతేడాది షెర్లిన్ చోప్రా వ్యాఖ్యలు చేయడంతో, రాఖీ సావంత్ ఆమెను దూషించిందన్నది కేసు. గతేడాది అక్టోబర్ 29న సాజిద్ ఖాన్ కు వ్యతిరేకంగా షెర్లిన్ చోప్రా వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. సాజిద్ ఖాన్ ను సల్మాన్ ఖాన్ కాపాడుతున్నారంటూ అనంతరం షెర్లిన్ చోప్రా ఆరోపించింది. దీంతో సాజిద్ ఖాన్ ను వెనకేసుకొచ్చిన రాఖీ సావంత్ షెర్లిన్ ను విమర్శించింది. దాంతో రాఖీపై షెర్లిన్ కేసు పెట్టింది.

దీనిపై రాఖీ సోదరుడు రాకేశ్ స్పందిస్తూ, తన సోదరి చేసిన తప్పు సీరియస్ దేమీ కాదన్నారు. పోలీసులు ఇచ్చిన గడువులోపు ఆమె హాజరు కాలేకపోయినట్టు చెప్పారు. తామంతా రాఖీకి అండగా ఉన్నామంటూ, షెర్లిన్ చోప్రాపై తాము సైతం కేసు నమోదు చేస్తామన్నారు.