బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షోకు వెళ్లే ప్రసక్తే లేదు: రోజా

17-01-2023 Tue 20:44 | Andhra
  • తనకు గతంలోనే ఆహ్వానం వచ్చిందన్న రోజా
  • అసెంబ్లీ సమావేశాల కారణంగా అప్పుడు వెళ్లలేదని వెల్లడి
  • చంద్రబాబు వెళ్లిన షోకు తాను వెళ్లనని స్పష్టీకరణ
I dont go to Balakrishna Unstoppable show says Roja
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు. సీజన్ 2లో చంద్రబాబు వంటి రాజకీయ నాయకులు సైతం వచ్చారు. ఈ షోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. షోకు వచ్చిన ప్రముఖులతో సరదాగా సంభాషిస్తూ, వారి నుంచి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు రాబడుతూ బాలయ్య ఈ షోను రక్తికట్టిస్తున్నారు.  

మరోవైపు ఏపీ మంత్రి రోజాతో బాలయ్యకు మంచి స్నేహం ఉంది. సినిమాలలో కలిసి నటించిన వీరిద్దరికీ రాజకీయపరమైన అంతరాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో బాలయ్య షోకు రోజా హాజరవుతారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రోజా స్పందిస్తూ... ఈ షోకు రావాలని తనకు గతంలోనే ఆహ్వానం అందిందని చెప్పారు. అయితే ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో తనకు సాధ్యపడలేదని తెలిపారు. ఇకపై ఆ షోకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. ఎప్పుడైతే షోకు చంద్రబాబు హాజరయ్యారో... ఆ షోకు వెళ్లకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ ను కించపరిచేలా చంద్రబాబు, బాలకృష్ణ మాట్లాడారని... అప్పుడే తనకు ఆ కార్యక్రమంపై ఆసక్తి పోయిందని చెప్పారు.