Team India: పాంచ్ పటాకా కోసం చాలా ప్రయత్నించా: సిరాజ్

  • కెప్టెన్ రోహిత్ కూడా తనకు 5 వికెట్లు రావాలనుకున్నాడని వ్యాఖ్య
  • శ్రీలంకతో మూడో వన్డేలో 4 వికెట్లు తీసిన హైదరాబాదీ పేసర్
  • 317 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసిన భారత్
Tried Very Hard says Mohammed Siraj After Missing Out On Maiden ODI Five Wicket Haul

శ్రీలంకతో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ సెంచరీలకు తోడు యువ పేసర్ మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో సత్తా చాటడంతో భారత్ అంతటి భారీ తేడాతో లంకను చిత్తుగా ఓడించింది. ఈ పోరులో నిప్పులు చెరిగే బౌలింగ్ తో లంక బౌలర్లను సిరాజ్ వణికించాడు. తన కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్ల స్పెల్ నమోదు చేసే అవకాశాన్ని అతను కొద్దిలో చేజార్చుకున్నాడు. ఇందుకోసం తాను చాలా ప్రయత్నించానని సిరాజ్ తెలిపాడు. కానీ, మ్యాచ్ లో నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగానని చెప్పాడు. 

‘నా వన్డే కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్ల స్పెల్ పొందాలని అనుకున్నాను. దాని కోసం చాలా కష్టపడ్డాను. కెప్టెన్ రోహిత్ సైతం నాకు ఐదు వికెట్లు రావాలని ప్రయత్నించాడు. కానీ, కుదరలేదు. కానీ రాసిపెట్టినన్ని వికెట్లే వచ్చాయనిపిస్తోంది’ అని మ్యాచ్ అనంతరం సిరాజ్ చెప్పాడు. ఈ మ్యాచ్ లో ఔట్ స్వింగర్లతో లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టినట్టు సిరాజ్ వెల్లడించాడు. కొన్నాళ్లుగా నాకు మంచి ఔట్ స్వింగ్ లభిస్తోంది. కానీ సీమ్ లో వైవిధ్యం చూపించడం వల్లే వికెట్లు వస్తున్నాయి. మొదట ఔట్‌స్వింగ్ డెలివరీలతో బ్యాటర్ల మనస్సులో కొంత సందేహాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా’ అని సిరాజ్ వెల్లడించాడు.

More Telugu News