ఆకలితో ఉన్న ప్రేక్షకులకు మంచి సినిమా అందించాం: బాలకృష్ణ

  • చంద్రగిరి ఎస్వీ థియేటర్ లో బాలకృష్ణ సందడి
  • కుటుంబంతో కలిసి వీరసింహారెడ్డి చిత్రం వీక్షణ
  • సినిమా చూసి చాలామంది భావోద్వేగానికి గురయ్యారన్న బాలయ్య
  • మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని వెల్లడి
Balakrishna watch Veerasimhareddy movie in Chandragiri SV Theater

సంక్రాంతి పండుగ వేడుకల కోసం నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా నారావారిపల్లె వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్ లో సందడి చేశారు. ఆయన నారావారిపల్లె నుంచి స్వయంగా కారులో చంద్రగిరి వచ్చారు. మరో కారులో వసుంధర, మోక్షజ్ఞ, దేవాన్ష్ వచ్చారు. 

థియేటర్ వద్ద బాలయ్యకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ ఆరాధ్య కథానాయకుడి రాకను పురస్కరించుకుని ఫ్యాన్స్ థియేటర్ వద్ద 50 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి ఎస్వీ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమాను తిలకించిన బాలకృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 

ఆకలితో ఉన్న ప్రేక్షకులకు మంచి సినిమా అందించామని తెలిపారు. ప్రేక్షకులు కుటుంబసమేతంగా వచ్చి వీరసింహారెడ్డి చిత్రాన్ని తిలకిస్తున్నారని వివరించారు. సినిమా చూసి చాలామంది భావోద్వేగానికి గురయ్యారని, ఏ విషయంలోనూ రాజీపడకుండా సినిమాను గొప్పగా తెరకెక్కించడం జరిగిందని బాలయ్య వెల్లడించారు. అభిమానులు కోరుకునే విధంగా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని చిత్రబృందాన్ని ప్రశంసించారు. సినిమా అనేది సమష్టి కృషి అనేది తానెప్పుడూ నమ్ముతానని తెలిపారు. 

సినిమాకు ఘనవిజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైందని బాలకృష్ణ అన్నారు. ఇక, ఏపీ పరిస్థితులపై స్పందిస్తూ, రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

More Telugu News