Diabetes: మధుమేహం బారిన పడ్డట్టు ఇలా తెలుసుకోవచ్చు..!

  • గుండె రక్తనాళాలు దెబ్బతింటాయ్
  • కంటి రక్తనాళాలకు నష్టం
  • డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి సమస్యలు
  • డయాబెటిక్ నెఫ్రోపతి రిస్క్
Diabetes symptoms 6 body parts that can signal high blood sugar

మధుమేహాన్ని సైలంట్ కిల్లర్ అని అంటుంటారు. దీనర్థం.. పైకి సమస్య కనిపించదు కానీ, అంతర్గతంగా నష్టం చేస్తుంది. బ్లడ్ షుగర్ పరిమితికి మించి దీర్ఘకాలం పాటు ఉన్నప్పుడు ముఖ్యమైన గుండె, మూత్రపిండాలు, కళ్లు తదితర అవయవాలకు నష్టం జరుగుతుంది. జీవనశైలి మార్పులతో మధుమేహం రిస్క్ చిన్న వయసు నుంచే పెరుగుతోంది. అందుకని ఈ సైలంట్ కిల్లర్ పై తగినంత అవగాహనతో ఉండాలి. మధుమేహం వచ్చినట్టు గుర్తించడానికి పలు మార్గాలున్నాయి. 

కళ్లు
అధిక బ్లడ్ షుగర్ తో రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. కంటి చూపు మసకబారడం, క్యాటరాక్ట్, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి సమస్యలు ఎదురవుతాయి. మన కంటి వెనుక ఉండే కీలకమైన లేయర్ రెటీనా. ఈ సమస్యలను సకాలంలో గుర్తించి, వెంటనే చికిత్స చేయించుకోకపోతే చూపు శాశ్వతంగా నష్టపోవాల్సి వస్తుంది.

పాదాలు
మధుమేహం రెండు రకాలుగా పాదాలకు నష్టం చేస్తుంది. నరాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా పాదాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో వచ్చిన ఇన్ఫెక్షన్లు త్వరగా మానవు. దీంతో ఆయా భాగాలు దెబ్బతిని, కాలునే తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మూత్రపిండాలు
రక్తంలోని వ్యర్థాలను వడగట్టి మూత్రాశయం ద్వారా బయటకు పంపించే అత్యంత కీలకమైన ప్రక్రియను మూత్రపిండాలు నిరంతరం చేస్తుంటాయి. అధిక మధుమేహం రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దీంతో డయాబెటిక్ నెఫ్రోపతి సమస్య బారిన పడతారు. తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న చక్కెరలను బయటకు పంపించేందుకు శరీరానికి అధిక నీరు అవసరం పడుతుంది. దీంతో తరచూ నీరు తాగాల్సి వస్తూ, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడాన్ని గుర్తించొచ్చు.

నరాలు
మధుమేహం ఉన్నవారికి డయాబెటిక్ న్యూరోపతి సమస్య కూడా ఏర్పడుతుంది. మంటలు, తిమ్మిర్లు, నొప్పి తెలియకుండా ఉండడం, కాళ్లలో మంటలు కనిపిస్తాయి.

గుండె రక్తనాళాలు
మధుమేహం నియంత్రణ తప్పితే గుండెకు సంబంధించిన రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దీంతో స్ట్రోక్, గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. మధుమేహం నియంత్రణలో లేకపోతే అధిక రక్తపోటు సహా గుండె జబ్బుల బారిన పడతారని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటోంది. 

చిగుళ్లు
మధుమేహం ఉన్న వారిలో పంటి చిగుళ్ల సమస్యలు కూడా ఎదురవుతాయి. రక్తనాళాలు మందపడి చిగుళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అంతేకాదు అధిక బ్లడ్ షుగర్ వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉంటాయి.

More Telugu News