Elvis Presley: సుప్రసిద్ధ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ కుమార్తె లీసా మేరీ ప్రెస్లీ మృతి

Elvis Presley daughter Lisa Marie Presley passes away
  • అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో లీసా కన్నుమూత
  • ఆమె వయసు 54 సంవత్సరాలు
  • కార్డియాక్ అరెస్ట్ కు గురైన లీసా
ప్రపంచ ప్రఖ్యాత రాక్ ఎన్ రోల్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ ఏకైక కుమార్తె లీసా మేరీ ప్రెస్లీ మృతి చెందారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తల్లి ప్రిసిల్లా ప్రెస్లీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. తన ప్రియమైన కుమార్తె అందరినీ వదిలి వెళ్లిందనే విషయాన్ని ఎంతో భారమైన హృదయంతో ప్రకటిస్తున్నానని ఆమె చెప్పారు. 

లీసా వయసు 54 సంవత్సరాలు. లాస్ ఏంజెలెస్ శివారు ప్రాంతమైన కాలాబాసాస్ లో ఉన్న తన నివాసంలో ఆమె నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. 1968లో లీసా జన్మించారు. ఆమె కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. మ్యూజిక్ నే కెరీర్ గా ఎంచుకున్నారు. మొత్తం మూడు ఆల్బబ్స్ ను రిలీజ్ చేశారు. తన జీవితంలో ఆమె నలుగురిని పెళ్లాడారు. ప్రఖ్యాత సింగర్ మైఖేల్ జాక్సన్ ను కూడా ఆమె పెళ్లి చేసుకున్నారు. హాలీవుడ్ స్టార్ నికొలస్ కేజ్, మ్యూజీషియన్ డానీ కీనో, మైఖేల్ లాక్ వుడ్ లను కూడా ఆమె పెళ్లాడారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

మంగళవారం రాత్రి జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. ఎల్విస్ ప్రెస్లీ కథాంశంతో తెరకెక్కిన ఎల్విస్ సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన ఆస్టిన్ బట్లర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమాన్ని లీసా, ఆమె తల్లి ప్రత్యక్షంగా వీక్షించారు. తన తండ్రిని తలచుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. ఇది జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే ఆమె కన్నుమూయడం సంగీత ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తోంది.
Elvis Presley
Daughter
Lisa Marie Presley

More Telugu News