Fronx: మారుతి సుజుకి నుంచి కొత్త వాహనం 'ఫ్రాంక్జ్'

  • గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్ పో-2023
  • కొత్త మోడల్ ఫ్రాంక్జ్ ను ప్రదర్శించిన మారుతి సుజుకి
  • ఆకట్టుకునేలా ఉన్న ఫీచర్లు, రూపం
Maruti Suzuki introduced Fronx

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి నుంచి కొత్త మోడల్ వస్తోంది. దీని పేరు ఫ్రాంక్జ్ (Fronx). తన ఫ్రాంక్జ్ (వైటీబీ) మోడల్ ను మారుతి సంస్థ గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పో-2023లో ప్రదర్శించింది. స్పోర్టీ లుక్ తో ఉన్న ముందుభాగం, 1.0 లీటర్ కే-సిరీస్ టర్బో ఇంజిన్ దీంట్లో ప్రత్యేకతలు. ఈ కారు తయారీలో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వినియోగించారు. 

బయటి భాగం చూస్తే నెక్స్ వేవ్ గ్రిల్, క్రిస్టల్ బ్లాక్ డీఆర్ఎల్ లైట్లు, విశాలమైన బాయ్ నెట్, వెనుకభాగంలో ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ ఫినిష్ అల్లాయ్ వీల్స్, దృఢమైన బాడీ, రూఫ్ రెయిల్స్ ఏర్పాటు చేశారు. 

ఇంటీరియర్ చూస్తే... డాష్ బోర్డును మెటల్ తరహా ఫినిషింగ్ తో డిజైన్ చేశారు. 9.0 అంగుళాల హెచ్ డీ స్మార్ట్ ప్లే ప్రొ ప్లస్ ఇన్ఫోటైన్ సిస్టమ్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో యాప్ కనెక్టివిటీ, అర్కామిస్ సౌండ్ సిస్టమ్, హెడ్ అప్ డిస్ ప్లే, టర్న్ బై టర్న్ నేవిగేషన్, 360 డిగ్రీ కెమెరా ఇందులో పొందుపరిచారు. ఇక సుజుకి కనెక్ట్ యాప్ తో 40 రకాల ఫీచర్లను పొందవచ్చు. 

ఇంజిన్ విషయానికొస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ (ప్యాడిల్ షిఫ్టర్స్) ఏర్పాటు చేశారు. ఇందులోనే మరో వెర్షన్ ఉంది. దీంట్లో 1.2 లీటర్ కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ అమర్చారు. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఏజీఎస్ పొందుపరిచారు. భద్రతా ఏర్పాట్ల విషయానికొస్తే, ఇందులో 6 ఎయిర్ బ్యాగులున్నాయి.

More Telugu News