blood group: స్ట్రోక్ రిస్క్ ఉందా..? బ్లడ్ గ్రూప్ చూసి చెప్పొచ్చంటున్న తాజా అధ్యయనం

  • ఏ, ఓ గ్రూపు వారికి 60 ఏళ్లలోపు రిస్క్
  • బీ గ్రూపు వారికి ఎప్పుడైనా వచ్చే ప్రమాదం
  • జన్యువులు, రక్త గ్రూపుల వారీ రిస్క్ వేర్వేరు
  • యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బృందం అధ్యయనం
Your blood type may predict risk of stroke before 60

స్ట్రోక్ అంటే వైద్య పరిభాషలో మెదడుకు రక్త ప్రవాహం నిలిచిపోవడం. దీనవల్ల మెదడులో కణజాలం దెబ్బతింటుంది. మెదడులో రక్త నాళాలు చిట్లి రక్తస్రావం అయినప్పుడు, ప్రమాదం కారణంగా మెదడుకు గాయమై రక్త స్రావం అయినప్పుడు, రక్త ప్రవాహంలో క్లాట్ ఏర్పడినప్పుడు ఎదురయ్యే సమస్యను స్ట్రోక్ గా చెబుతారు. సకాలంలో స్పందించకపోతే కొన్ని అవయవాలు పని చేయకుండా పోతాయి. 

60 ఏళ్లలోపు స్ట్రోక్ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది..? బ్లడ్ గ్రూపు ఆధారంగా చెప్పొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బృందం అంటోంది. వీరు చేసిన పరిశోధన ఫలితాలు జర్నల్ న్యూరాలజీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. వ్యక్తుల బ్లడ్ గ్రూపు, వారికి సంబంధించిన జన్యువులను వీరు విశ్లేషించారు. O బ్లడ్ గ్రూప్ వారికి వృద్ధాప్యానికి ముందే స్ట్రోక్ రిస్క్ ఉంటుందని గతంలోనే వెల్లడైందని, ఈ రక్త గ్రూపులకు, ముందస్తు స్ట్రోక్ కు మధ్య బలమైన అనుబంధాన్ని గుర్తించినట్టు ఈ అధ్యయన ఫలితాలను రూపొందించిన డాక్టర్ మిచెల్ తెలిపారు.

‘‘జన్యుపరమైన ముందస్తు స్ట్రోక్ రిస్క్ A బ్లడ్ గ్రూపు, O బ్లడ్ గ్రూప్ వారికి ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ తరహా జన్యువులు ఉండే వారిలో బ్లడ్ క్లాట్ ఏర్పడి స్ట్రోక్ కు కారణం అవుతున్నాయి’’ అని డాక్టర్ మిచెల్ తెలిపారు. ఇస్చెమిక్ స్ట్రోక్, జన్యువులపై నార్త్ అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా జరిగిన 48 అధ్యయన ఫలితాలను ఈ బృందం విశ్లేషించింది. 60 ఏళ్లలోపు స్ట్రోక్ వస్తే దాన్ని ఇస్చెమిక్ స్ట్రోక్ గా చెబుతారు. A గ్రూపు వారికి ముందుగా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుందట. ఇక O గ్రూపు వారికి 60 ఏళ్ల తర్వాత స్ట్రోక్ రావడం చాలా తక్కువని గుర్తించారు. B గ్రూపు వారికి 60 ఏళ్లలోపు, తర్వాత కూడా వచ్చే అవకాశాలుంటాయి.

More Telugu News