vaccinations: కరోనా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించాల్సిన సమయం ఇది.. నిపుణులు

  • దీర్ఘకాలిక వ్యాధులున్న వారికే కరోనా టీకాలు ఇవ్వాలని సూచన
  • ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి సహజ రక్షణ ఉంటుందని వెల్లడి
  • ప్రజారోగ్య సదుపాయాల బలోపేతంపై నిధులు వెచ్చించాలని సూచన
Limit vaccinations to at risk population declare end of the pandemic experts

నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ కరోనా మహమ్మారి గురించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఇంత వరకు కరోనా బారిన పడని వారికి, కోమార్బిడిటీలు (దీర్ఘకాలిక వ్యాధులు రెండు, అంతకంటే ఎక్కువ) ఉన్నవారికే కరోనా టీకాలను సూచించాలని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. ఇప్పటికే కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి రెండు ప్రాథమిక టీకా డోసులు, ప్రికాషనరీ లేదా బూస్టర్ డోస్ తో వచ్చే అదనపు రక్షణ, ప్రయోజనం ఏమీ లేవని పేర్కొంది. ఒక్కసారి కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు తిరిగి దాని బారిన పడే అవకాశాలు చాలా తక్కువని, వీరిలో సహజంగానే రక్షణ ఉంటుందని తెలిపింది. 

కరోనా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించాల్సిన సమయం ఇదంటూ సూచించింది. అదే సమయంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, టీకాల తయారీ పరిశ్రమ కరోనా వంటి వ్యాధుల సమయంలో.. ప్రజారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తల మాదిరి వ్యవహరించడాన్ని అడ్డుకునేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. 

అనవసర, అసాధారణంగా కరోనా టీకాలను వాడడం వల్ల ఇతర ప్రజారోగ్య కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన వనరులను అనవసరంగా మళ్లించినట్టు అవుతుందని ఈ టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. అనవసర టీకాలను నిరోధించడం ద్వారా వనరులను కాపాడుకోవచ్చని పేర్కొంది. దీనికి బదులు ప్రజారోగ్య సదుపాయాల బలోపేతంపై దృష్టి పెట్టాలని, అలా చేయడం వల్ల ప్రస్తుత సంక్షోభంతో పాటు, భవిష్యత్తులో తలెత్తే ఈ తరహా సంక్షోభాలకు సన్నద్ధత పెరుగుతుందని సూచించింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడెమాలజిస్ట్స్ ఈ టాస్క్ ఫోర్స్ లో భాగంగా ఉన్నాయి.

More Telugu News