మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
- 236 మందితో మాస్కో నుంచి గోవా బయలుదేరిన విమానం
- విమానంలో బాంబు ఉన్నట్టు గోవా ఏటీసీకి ఫోన్
- జామ్‌నగర్ విమానాశ్రయంలో అత్యవసర లాండింగ్
- ప్రయాణికులను సురక్షితంగా తరలించిన బాంబ్ స్క్వాడ్
విమానంలోని 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందిని గత రాత్రి 9.49 గంటల సమయంలో సురక్షితంగా ఖాళీ చేయించినట్టు జామ్‌నగర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. మాస్కో నుంచి బయలుదేరిన విమానం గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉందని గోవా పోలీసులు తెలిపారు. అయితే, బాంబు బెదిరింపు నేపథ్యంలో దానిని జామ్‌నగర్‌కు మళ్లించినట్టు పేర్కొన్నారు.
బాంబు బెదిరింపు ఉత్తదే
కాగా, రాత్రంతా విమానాన్ని తనిఖీ చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) అనుమానాస్పద వస్తువేదీ విమానంలో కనిపించలేదని నిర్ధారించింది. ప్రతి ప్రయాణికుడి బ్యాగేజీని తనిఖీ చేసినట్టు జామ్‌నగర్ ఎస్పీ తెలిపారు. బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలడంతో విమానం గోవా వెళ్లేందుకు క్లియరెన్స్ లభించింది. ఉదయం 10 గంటలకు విమానం బయలుదేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.