alcohol: ఆల్కహాల్ ఒక్క చుక్క చాలు కేన్సర్ కు ఆజ్యం పోయడానికి: డబ్ల్యూహెచ్ వో

  • ఆరోగ్యకరంగా సురక్షిత ఆల్కహాల్ మోతాదు అంటూ లేదని స్పష్టీకరణ
  • ఎంత ఎక్కువ తాగితే అంత హానికరమన్న డబ్ల్యూ హెచ్ వో
  • ఆల్కహాల్ ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుందని హెచ్చరిక
Cancer risk starts with first drop of alcohol WHO

మద్యం తాగే అలవాటు ఉన్న వారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న తాజా హెచ్చరిక విని ఒక్కసారి ఉలిక్కి పడాల్సిందే. ఒక్క చుక్క మద్యంతోనూ కేన్సర్ రిస్క్ మొదలవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రోజూ చాలా పరిమితంగా 30 ఎంఎల్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే వార్తలు వినే ఉంటారు. కానీ, ఆరోగ్యరీత్యా ఏ మోతాదు కూడా మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. లాన్సెట్ పబ్లిక్ హెల్త్ మేగజైన్ లో ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ఒకటి ప్రచురితమైంది.

‘‘ఆల్కహాల్ వినియోగం పరంగా ఆరోగ్యంపై ప్రభావం చూపించని మోతాదు అంటూ ఏదీ లేదు. మనుషుల శరీరాల్లో ఆల్కహాల్ వల్ల కార్సినోజెనిక్ (కేన్సర్ కారక) ప్రభావానికి సంబంధించి మోతాదు అంటూ ఏదీ లేదు. ఎంతో ప్రచారంలో ఉన్న సురక్షిత ఆల్కహాల్ వినియోగ పరిమితి గురించి మాట్లాడడం సరికాదు. ఎంత మోతాదు తాగుతున్నారనేది కాదు. ఏ ఆల్కహాల్ అయినా మొదటి చుక్క నుంచే కేన్సర్ రిస్క్ ఉంటుంది. ఎంత  ఎక్కువ తాగితే, అంత నష్టం జరుగుతుంది’’అని డబ్ల్యూహెచ్ వో యూరప్ రీజినల్ ఆఫీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ కారినా ఫెర్రీరా బోర్జెస్ తెలిపారు.

ఆల్కహాల్ అన్నది టాక్సిక్, సైకోయాక్టివ్, గ్రూప్ 1 కార్సినోజెనిక్ అని దశాబ్దాల క్రితమే గుర్తించిన విషయాన్ని డబ్ల్యూహెచ్ వో ప్రస్తావించింది. దీని ప్రకారం ఆస్బెస్టాస్, రేడియేషన్, పొగాకు తదితర అధిక రిస్క్ తో కూడిన గ్రూపులోనే ఆల్కహాల్ కూడా ఉండనుంది. ‘‘ఆల్కహాల్ కనీసం ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుంది. ఇందులో అత్యధికంగా కనిపించేది బవెల్ కేన్సర్, తర్వాత మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్. బయోలాజికల్ మెకానిజమ్ రూపంలో ఇథనాల్ (ఆల్కహాల్ లో వినియోగించే) కేన్సర్ కు కారణమవుతుంది. ఆల్కహాల్ ఏదైనా కానీ, ధర, నాణ్యతతో సంబంధం లేకుండా కేన్సర్ అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది’’అని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

More Telugu News