DR. SAUNDARYA RAJESH: మహిళలకు రక్షణ, ఉపాధి కల్పనలో చెన్నై టాప్!

  • నివేదికను వెల్లడించిన అవతార్ గ్రూప్ 
  • వందకు పైగా రిపోర్టులను అధ్యయనం చేసిన తర్వాత నివేదిక రూపకల్పన
  • నాలుగో స్థానంలో హైదరాబాద్.. ఢిల్లీకి 14వ స్థానం
Chennai in First Place in Women Safety in India

మహిళలకు రక్షణ, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన విషయాల్లో తమిళనాడు రాజధాని చెన్నై అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేష్ తెలిపారు. మహిళకు ఉపాధి అవకాశాలు ఉన్నంత మాత్రాన సరిపోదని, దానికి అనుబంధంగా రవాణా, రక్షణ, సౌకర్యాలు, సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయన్నారు. ‘టాప్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా’ అంశంపై నిన్న ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

వివిధ అంశాలపై వందకు పైగా నివేదికలను అధ్యయనం చేసిన తర్వాతే తాజా నివేదికను రూపొందించినట్టు ఆమె చెప్పారు. 10 లక్షల మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీ-1 నగరాల్లో మహిళలకు అనువైన నగరంగా చెన్నై దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పూణె, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, కోయంబత్తూరు, మధురై ఉన్నట్టు చెప్పారు. ఈ జాబితాలో ఢిల్లీకి 14వ స్థానం దక్కింది.

10 లక్షల మంది కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీ-2 నగరాల్లో తిరుచునాపల్లి మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా వెల్లూరు, సేలం, ఈరోడ్, తిరువూర్, పాండిచ్చేరి, సిమ్లా, మంగళూరు, తిరువనంతపురం, బెళగావి నగరాలు నిలిచాయి.

More Telugu News