Cricket: వచ్చే ఆసియా కప్ లోనూ ఒకే గ్రూప్ లో భారత్, పాకిస్థాన్

  • సెప్టెంబర్ లో టోర్నీ ఉంటుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడి
  • రెండేళ్ల క్రికెట్ క్యాలెండర్ ను విడుదల చేసిన ఏసీసీ అధ్యక్షుడు జై షా
  • టోర్నీ ఆతిథ్య హక్కులు సొంతం చేసుకున్న పాక్
India Pakistan In Same Group In Mens ODI Asia Cup 2023

దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు ఎప్పుడూ పండగే. ఇరు జట్లూ ఎప్పుడు తలపడ్డా క్రికెట్ ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ ఏడాది కూడా ఇరు జట్లూ మరోసారి తలపడనున్నాయి. ఆసియా కప్ (వన్డే) టోర్నమెంట్ లో ఇరు జట్లూ పోటీ పడతాయి. ఈ టోర్నీ సెప్టెంబర్‌లో జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం వెల్లడించింది. ఈ టోర్నీలో దాయాది దేశాలు ఒకే గ్రూప్ లో బరిలోకి దిగుతున్నాయి. క్వాలిఫైయింగ్ జట్టుతో పాటు భారత్-పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉంటాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. 

మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లు ఉన్నాయి. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ సొంతం చేసుకుంది. అయితే, పాక్ లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తోంది. టోర్నీని తటస్థ వేదిక అయిన యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ చెబుతోంది. అందుకు పాకిస్థాన్ ఒప్పుకోవడం లేదు. టోర్నీ తమ దేశం నుంచి తరలిస్తే ఈ ఏడాది భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ ను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించింది. కాగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2023, 2024లో జరిగే పలు ఈవెంట్ల షెడ్యూల్, క్యాలెండర్ ను కూడా జై షా ప్రకటించారు. పురుషులు, మహిళలతో పాటు వివిధ వయోవిభాగాల్లో ఆసియా స్థాయిలో పలు టోర్నీలకు సంబంధించి వివరాలు వెల్లడించారు.

More Telugu News