Payyavula Keshav: పయ్యావుల కేశవ్ ఫిర్యాదుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందన.. అనంతపురంలో అవినాశ్ కుమార్ పర్యటన

CEC Principal Secretary Visits Anantapru Dist On Payyavula Keshav Complaint
  • ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేసిన కేశవ్
  • ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన సీఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ
  • రెండు గంటలపాటు అధికారులను విచారించిన వైనం 
  • బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే సీఈసీపై నమ్మకం పోతుందన్న పయ్యావుల
తన నియోజకవర్గ పరిధిలోని చీకలగుర్కిలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారన్న స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) స్పందించింది. సీఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ నిన్న అనంతపురం జిల్లాలో పర్యటించారు. మధ్యాహ్నం ఉరవకొండకు చేరుకున్న ఆయన తహసీల్దార్ కార్యాలయంలో రెండు గంటలపాటు అధికారులను విచారించారు. పయ్యావుల ఫిర్యాదు చేసే సమయానికి తహసీల్దారుగా ఉన్న రజాక్ వలి, వీఆర్వో, బీఎల్వోలను వేర్వేరుగా విచారించారు. ఓట్ల తొలగింపునకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లిన అవినాశ్ కుమార్.. పయ్యావులను అక్కడికి పిలిపించి కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సమక్షంలో ఆయన వాదన విన్నారు.

అనంతరం పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ.. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. లేదంటే సీఈసీపై నమ్మకం పోతుందని చెప్పానన్నారు. విచారణ కోసం సీఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లాకు వస్తున్న విషయం తెలిసి ముందు రోజే ఇద్దరు బీఎల్వోలను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారని ఆరోపించారు. నిజానికి ఓట్ల తొలగింపులో బీఎల్వోల పాత్ర ఏమీ ఉండదని, ఓట్ల అక్రమ తొలగింపునకు ఆమోదం తెలిపిన ఏఈఆర్, ఈఆర్‌వోలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Payyavula Keshav
Telugudesam
Anantapur District
Uravakonda
CEC

More Telugu News