AICC: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మాణిక్‌రావు ఠాక్రే.. గోవాకు మాణికం ఠాగూర్

  • టీపీసీసీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిన గంటల్లోనే గోవా ఇన్‌చార్జ్‌గా నియామకం
  • ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధిష్ఠానం
  • మాణికం ఠాగూర్.. మాణిక్‌రావు ఠాక్రేలను అటూఇటు మార్చిన ఏఐసీసీ
Manikrao Thakre Telangana Congress New Incharge

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మాణికం ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకోవడంతో రేగిన కలకలం విషయంలో స్పష్టత వచ్చింది. బాధ్యతల నుంచి ఆయనను రిలీవ్ చేసిన పార్టీ అధిష్ఠానం.. ఆయనకు గోవా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది. అలాగే, తెలంగాణకు ఆయన స్థానంలో మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ అకస్మాత్తు నిర్ణయానికి గల కారణం తెలియకపోయినా మాణికంపై ఠాగూర్‌పై సీనియర్ నేతల్లో ఉన్న వ్యతిరేకతే ఇందుకు కారణమని చెబుతున్నారు.

తెలంగాణలో జూనియర్, సీనియర్ నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించలేకపోయారన్న అపప్రథను మాణికం ఠాగూర్ మూటకట్టుకున్నారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు పెరిగి సమస్య జటిలంగా మారడానికి కూడా ఆయనే కారణమన్న ఆరోపణలున్నాయి. అలాగే, ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయని, టీపీసీసీకి అనుకూలంగా తీసుకుంటున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మాణికం ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూపు నుంచి తప్పుకోవడం, ఆ వెంటనే ఆయనను గోవా ఇన్‌చార్జ్‌గా నియమించడం చకచకా జరిగిపోయాయి.

More Telugu News