Captain: ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్ లో తొలి మహిళా ఆఫీసర్ నియామకం

  • కుమార్ పోస్ట్ వద్ద శివ చౌహాన్ నియామకం 
  • ప్రకటించిన ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్
  • సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలన్నది ఆమె అభిలాష
Captain Shiva Chouhan becomes first woman officer to be deployed at Siachen worlds highest battlefield

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యద్ధభూమిగా పేరొందిన సియాచిన్ లో.. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని హిమాలయ పర్వత సానువుల్లో, మొదటిసారి భద్రతా విధుల నిర్వహణకు తొలిసారిగా ఓ మహిళా ఆఫీసర్ నియమితులయ్యారు. సైన్యంలోని ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ విభాగానికి చెందిన కెప్టెన్ శివ చౌహాన్ రక్షణ బాధ్యతలు చేపట్టారు. దీనికంటే ముందు కొన్ని నెలల పాటు సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో ఆమె శిక్షణ పొందారు. ఇక్కడ అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, అధిక మంచు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ విధులు నిర్వహించడం అంత సులభం కాదు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 15632 అడుగుల ఎత్తులో ఉంటుంది.

కఠోర శిక్షణ అనంతరం కుమార్ పోస్ట్ వద్ద శివ చౌహాన్ ను నియమించినట్టు ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. కెప్టెన్ శివ చౌహాన్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 11 ఏళ్ల వయసులో తండ్రి  మరణించగా, తల్లి కుటుంబ బాధ్యతలు చేపట్టి, శివను చదివించింది. భారత సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవలు అందించాలన్న అభిలాషతో ఆమె సైన్యంలో ప్రవేశం పొందారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు ప్రదర్శించడంతో సియాచిన్ లో బ్యాటిల్ స్కూల్ శిక్షణకు ఎంపికయ్యారు. దీన్ని సైతం విజయవంతంగా పూర్తి చేసుకుని సియాచిన్ లోని ఓ పోస్ట్ వద్ద తాజాగా నియమితులయ్యారు.

More Telugu News