Sandeep Singh: దేశం విడిచి వెళ్తే కోటి రూపాయలు ఇస్తామంటున్నారు: లైంగిక వేధింపులకు గురైన మహిళా కోచ్ ఆరోపణ

  • సిట్ దర్యాప్తుకు హాజరైన బాధిత మహిళా కోచ్
  • హర్యానా పోలీసులు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణ
  • ముఖ్యమంత్రి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ సింగ్‌కే వంతపాడుతున్నారని ఆగ్రహం
  • మాజీ మంత్రిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనా అరెస్ట్ చేయలేదన్న బాధితురాలి న్యాయవాది
Sandeep Singh case Haryana woman coach claims being offered Rs 1 crore to leave country

హర్యానా క్రీడల మాజీ మంత్రి సందీప్ సింగ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్టుగా చెబుతున్న మహిళా కోచ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్తే కోటి రూపాయలు ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. హర్యానా పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. చండీగఢ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరైన అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు. 

‘సిట్’కు తాను అన్ని విషయాలు వివరంగా చెప్పానని బాధిత మహిళా కోచ్ తెలిపారు. పెండింగ్ సమస్యల గురించి కూడా సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటన విన్నానని, ఆయన కూడా సందీప్ సింగ్ వైపే ఉన్నట్టు అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. చండీగఢ్ పోలీసులు తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, కానీ హర్యానా పోలీసులు మాత్రం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. 

ఇండియాను విడిచి నచ్చిన దేశం ఎక్కడికైనా వెళ్లిపోతే నెలకు కోటి రూపాయలు ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. బాధిత కోచ్ న్యాయవాది దీపాన్షు బన్సాల్ మాట్లాడుతూ.. చండీగఢ్ పోలీసులు ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని అరెస్ట్ చేయలేదని, విచారించలేదని అన్నారు. సందీప్  సింగ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయని, అయినప్పటికీ ఆయనను అరెస్ట్ చేయలేదని అన్నారు. బాధితురాలి ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.

More Telugu News