Hanamkonda: పెళ్లికి అంగీకరించని యువతి .. గొంతు కోసిన ప్రియుడు

Lover Slits Young Girl throat for not willing to marry
  • హనుమకొండ జిల్లా కడిపికొండలో ఘటన
  • యువతి కోసం మతం మారినా అంగీకరించని ఆమె కుటుంబ సభ్యులు
  • యువకుడిని పట్టుకుని చితకబాదిన బాధిత కుటుంబ సభ్యులు
  • యువతికి తప్పిన ప్రాణాపాయం
ప్రేమిస్తున్న యువతి పెళ్లికి నిరాకరించడంతో గొడవ పడిన యువకుడు ఆపై కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని కడిపికొండ గ్రామంలో గత రాత్రి జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అదే గ్రామానికి చెందిన యువతి (26) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రియురాలి మతం వేరు కావడంతో అది తమ పెళ్లికి అడ్డం రాకూడదని భావించిన యువకుడు ఆమె మతాన్ని స్వీకరించాడు. అయినప్పటికీ యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఇదే విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

గత రాత్రి యువతి ఇంటికి వెళ్లిన యువకుడు పెళ్లి విషయమై ఆమెను నిలదీశాడు. పెళ్లి చేసుకుందామని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. చేతిపై కూడా గాయం చేశాడు. వెంటనే అప్రమత్తమైన యువతి కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. మడికొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన యువతిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. యువతికి ప్రాణాపాయం లేదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hanamkonda
Warangal
Kazipet
Love
Crime News

More Telugu News