Delhi woman: స్కూటీని ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వీడియో ఇదిగో!

  • తీవ్ర గాయాలతో యువతి దుర్మరణం
  • న్యూఇయర్ వేళ దేశ రాజధానిలో దారుణం
  • మద్యం మత్తులో కారు నడిపిన యువకులు
Car That Dragged A Delhi Woman For 12 Km

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీకొట్టారు. దీంతో స్కూటీతో పాటు దానిని నడుపుతున్న యువతి కారు కింద కిందపడిపోయింది. కారుకింద ఇరుక్కున్న యువతిని అలాగే 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. తీవ్రగాయాలతో ఆ యువతి రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.

ఢిల్లీలోని సుల్తాన్ పురిలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఫంక్షన్ కు హాజరైన బాధితురాలు స్కూటీపై ఇంటికి వెళుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం సేవించిన ఐదుగురు యువకులు బలెనో కారు నడుపుతూ ఈ యాక్సిడెంట్ చేశారు. యువతిని అలాగే రోడ్డుపై ఈడ్చుకెళుతుంటే మిగతా వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

రోడ్డుపై కీలోమీటర్ల కొద్దీ ఈడ్చుకెళ్లడంతో యువతి ఒంటిపై బట్టలన్నీ పీలికలయ్యాయి. తీవ్రగాయాలతో యువతి చనిపోయింది. చివరకు ఓ చోట కారు నుంచి యువతి శరీరం విడిపడిపోయింది. డెడ్ బాడీని గుర్తించి స్థానికులు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, ఈ ప్రమాదం వెనక లైంగిక వేధింపుల కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందిస్తూ.. సిగ్గుతో తలవంచుకోవాల్సిన దారుణమని వ్యాఖ్యానించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

More Telugu News