RGV: ప్రపంచంలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఒక్క డొనాల్డ్ ట్రంప్‌కు తప్ప: రాంగోపాల్ వర్మ

  • పాత సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయన్న ఆర్జీవీ
  • ఎవరూ ఎవరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం లేదన్న దర్శకుడు
  • కొత్త నటులు ఈ ఏడాది షారుఖ్, సల్మాన్, ఆమిర్‌లను మించిపోవాలని ఆకాంక్ష
RGV New Year Wishes To World Except Donald Trump

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి కొంత వెరైటీగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచంలోని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం మినహాయించారు. ఎవరు ఎవరికి శుభాకాంక్షలు చెబుతున్నారన్నది కాదని, ఎవరూ ఎవరికీ హృదయపూర్వకంగా చెప్పడం లేదని పేర్కొన్నారు. పాత సంవత్సరంలో ఉన్న సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని, ఉన్నవాటికి మరిన్ని కలుస్తాయని అన్నారు. నెరవేర్చుకోలేని తీర్మానాలనే కొత్త ఏడాదిలో చేసుకుంటామన్న వర్మ.. కనీసం ఈ విషయంలోనైనా నీతి, నిజాయతీగా ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6 బిలియన్ల జనాభాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ అందులోంచి డొనాల్డ్ ట్రంప్‌ను మినహాయించారు. సమస్యలన్నీ డిసెంబరు 31, 2022 రాత్రి వరకు మాత్రమేనని, పడుకుని నిద్రలేగానే జనవరి 1, 2023 నుంచి మళ్లీ కొనసాగుతాయని, ఎందుకంటే ఇప్పటికీ నువ్వు అదే పాత భార్య, అదే పాత భర్తతో ఉంటున్నావు కాబట్టి అంటూ వరుస ట్వీట్లలో రాసుకొచ్చారు.  

కొత్త ఏడాదిలో నేరస్థులెవరూ పట్టుబడకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. అన్ని నేరాలు ఆగిపోవాలని, పోలీసులు పని లేకుండా ఉండాలని ఆర్జీవీ ఆకాంక్షించారు. అవకాశాల కోసం వేచి చూస్తున్న నటులు ఈ ఏడాది షారుఖ్, సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లను మించిపోవాలని కోరుకున్నారు. మీ శత్రువులందరూ కలిసి మిమ్మలని వెన్నుపోటు పొడిచే వారి నుంచి కాపాడాలని, కొత్త ఏడాదిలో కరోనా వైరస్‌కు డేంజరస్ వ్యాక్సిన్ల నుంచి ఇమ్యూనిటీ రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ కొత్త ఏడాదిలో ముకేశ్ అంబానీ తన సంపదనంతా తన కుమారులకు కాకుండా మీ అందరికీ పంచిపెట్టాలని కోరుకుంటున్నట్టు ఆర్జీవీ పేర్కొన్నారు. భార్యలందరూ ఈ కొత్త ఏడాదిలో భర్తలను మరింత అర్థం చేసుకోవాలని రాంగోపాల్ వర్మ ఆకాంక్షించారు.

More Telugu News