Snowfall: హిమాచల్ ప్రదేశ్ లో భారీ హిమపాతం... మంచులో చిక్కుకున్న 400 వాహనాలు

  • రోహటాంగ్ అటల్ టన్నెల్ వద్ద నిలిచిపోయిన వాహనాలు
  • గురువారం రాత్రి నుంచి వాహనాల్లోనే పర్యాటకులు
  • ఆహారం అందించిన పోలీసులు
  • 12 గంటల పాటు శ్రమించి వారిని కాపాడిన వైనం  
Huge snowfall in Himachal Pradesh as 400 vehicles stranded at Rohtang Atal Tunnel

హిమాచల్ ప్రదేశ్ లోని రోహటాంగ్ అటల్ టన్నెల్ వద్ద భారీ హిమపాతం కారణంగా వందలాది పర్యాటకులు చిక్కుకుపోయారు. మనాలి-లేహ్ రహదారిలో గురువారం నుంచి తీవ్రస్థాయిలో మంచు కురుస్తుండడంతో 400కి పైగా వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున మంచు రోడ్డుపై పేరుకుపోయింది. మంచు కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాంతో, పర్యాటకులు గురువారం రాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

దీనిపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పర్యాటకులను కాపాడారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి పర్యాటకులను అక్కడి నుంచి తరలించగలిగారు.  అంతకుముందు, హిమపాతం కారణంగా వాహనాల్లోనే ఉండిపోయిన పర్యాటకులకు పోలీసులు ఆహార పదార్థాలు అందించారు. 

కాగా, మంచులో చిక్కుకుపోయిన పర్యాటకుల్లో అత్యధికులు కులు మనాలి వెళుతున్నవారే. నూతన సంవత్సర వేడుకల కోసం వారు హిల్ స్టేషన్ కు వెళుతున్నారు. పోలీసులు కాపాడిన అనంతరం వారు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.

More Telugu News