Curry Leaves: కరివేపాకే గదా అని తీసిపారేయవద్దు.. ఎన్నో ఔషధ గుణాలు

  • కంటికి, గుండెకు మంచి చేస్తుంది
  • రక్తహీనతను తగ్గిస్తుంది
  • రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది
  • యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేషన్ గుణాలు
Curry Leaves Can Help You Prevent Chest Congestion

మనం పోపుల్లో వేసుకునే కరివేపాకు పెద్ద ఔషధ గని అని తెలుసా? చాలా మందికి తెలియదు. కూరల్లో, పప్పులో, సాంబారులో వచ్చే కరివేపాకు ఆకులను తినకుండా కొందరు పళ్లెంలో పక్కకు పెట్టేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పిదం. నేటి జీవనశైలి సమస్యలతో బాధపడే వారికి కరివేపాకు మంచి పరిష్కారం. చిన్ననాటి నుంచే దీన్ని ఎక్కువగా వినియోగించడం అలవాటు చేసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు. కరివేపాకుతో వచ్చే ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణుల సూచనలను పరిశీలించినట్టయితే..

వాయు కాలుష్యానికి కరివేపాకు ఓ మంచి పరిష్కారం. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ఫ్లమేషన్, ఎక్స్ పెక్టోరెంట్ గుణాలు ఉన్నాయి. అంటే వాయు కాలుష్యం వల్ల మన ఉపితిత్తుల్లోకి చేరే వాటిని తొలగించగలదు. కళ్లెను తీసేస్తుంది. 

కరివేపాకులో విటమిన్ ఏ, బీ, సీ, బీ2, బీ3, బీ9, విటమిన్ ఈ, క్యాల్షియం, ఐరన్, జింక్ దండిగా ఉంటాయి. పీచు ఉంటుంది కనుక పేగులకు, గుండెకు మంచి చేస్తుంది. ప్రొటీన్ కూడా లభిస్తుంది. జీర్ణాశయ శక్తిని పెంచుతుంది. స్వల్ప లాక్సేటివ్ గుణాలు దీనికి ఉన్నందున సాఫీ విరేచనం అవుతుంది. శిరోజాల వృద్ధికి, రక్త ప్రసరణకు తోడ్పడుతుంది.

రక్తంలో గ్లూకోజు నియంత్రణకు సాయపడుతుంది. లిపిడ్ ఫ్రొఫైల్ ను ఆరోగ్యంగా మారుస్తుంది. అంటే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కంటి, శిరోజాలు, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. గాయాలను త్వరగా మానేలా చేయగలదు. రక్త హీనతతో బాధపడేవారికి ఇదొక మంచి ఎంపిక. 

ప్రతి రోజూ ఓ గ్లాసు కరివేపాకు రసాన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. లేదంటే రోజూ 10-15 ఆకులను నమిలి తిన్నా సరిపోతుంది. దీపివల్ల నోటిలోని బ్యాక్టీరియా వృద్ధి చెందదు. దీన్ని తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఫలితాలను స్వయంగా చూస్తారని నిపుణులు చెబుతున్నారు. ముదురు ఆకుపచ్చని ఆకులు మంచివి. తాజా ఆకులను కాండం నుంచి వేరు చేసి శుభ్రంగా కడిగి, తడి పోయేలా నీడలో ఆరబెట్టుకోవాలి. అనంతరం ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు. రిఫ్రిజిరేటర్ లో రెండు వారాల వరకు నిల్వ ఉంటుంది.

More Telugu News