Pushpa Kamal Dahal: నేపాల్ నూతన ప్రధానిగా పుష్పకుమార్ దహాల్ ‘ప్రచండ’

Pushpa Kamal Dahal Prachanda is new Prime Minister of Nepal
  • 275 మంది సభ్యులున్న సభలో ప్రచండకు 165 మంది మద్దతు
  • రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం
  • ప్రధానిగా మూడోసారి ఎన్నికైన ప్రచండ
నేపాల్ నూతన ప్రధానిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమాల్ దహాల్ ‘ప్రచండ’ నియమితులయ్యారు. అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఆదివారం ఆయనను నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం ప్రచండను నియమించినట్టు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రచండ ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది. ఆదివారం సాయంత్రం 5 గంటలలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని బిద్యాదేవి భండారి ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గడువు ముగియడానికి ముందే ప్రచండ లేఖను సమర్పించారు. 

అధ్యక్ష కార్యాలయానికి వెళ్లిన వారిలో ప్రచండతోపాటు సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీ) అధ్యక్షుడు రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చీఫ్ లింగ్డెన్ తదితరులు ఉన్నారు. ప్రచండను ప్రధానమంత్రిగా నియమించాలని కోరుతూ వారు బిద్యాదేవికి వినతి పత్రాన్ని సమర్పించారు.   

275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభలో ప్రచండకు 165 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరిలో సీపీఎన్-యూఎంఎల్‌కు చెందిన 78, సీపీఎన్-ఎంసీకి చెందిన 32 మంది, ఆర్ఎస్‌పీకి చెందిన 20 మంది, ఆర్‌పీపీకి చెందిన 14 మంది జేఎస్పీకి చెందిన 12 మంది జనమత్‌కు చెందిన ఆరుగురు, నాగరిక్ ఉన్ముక్తి పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నారు. కాగా, ప్రచండ నేపాల్ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది మూడోసారి.
Pushpa Kamal Dahal
Nepal
Prime Minister

More Telugu News