Chandrababu: పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఏంటి?.. ఆ భూమి ఏమైనా ఆయన తాత ఇచ్చాడా?: నిప్పులు చెరిగిన చంద్రబాబు

TDP Chief Chandrababu Slams YS Jagan In Bobbili
  • బొబ్బిలిలో ‘ఇదేం ఖర్మ మన రైతులకు’ సదస్సు
  • టీడీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంలా ఉండేదన్న బాబు
  • జగన్‌కు అసలు వ్యవసాయమే తెలియదని ఎద్దేవా
  • వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది దేశంలో టీడీపీయేనన్నచంద్రబాబు
విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రైతులకు’ సదస్సులో పాల్గొన్న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన రైతులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంలా ఉండేదన్నారు. రైతులు పండించే పంట నేరుగా రైతులకే చేరేలా అప్పట్లో తాము చర్యలు తీసుకున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతాంగం బాగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

వ్యవసాయం కొత్తకాదని, అది జగన్‌తోనే రాలేదని అన్నారు. జగన్‌కు అసలు వ్యవసాయమే తెలియదని అన్నారు. ముందు వ్యవసాయం చేసి ఆ తర్వాతే రాజకీయాల్లో పైకొచ్చామని అన్నారు. వ్యవసాయమంటే ఏమిటి? రైతుల ఇబ్బందులేంటి? అని ఎన్టీఆర్, తాను ఆలోచించామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రాకుంటే తాము ఆదుకున్నామని గుర్తు చేశారు. రైతుల ఇబ్బందులు, సమస్యలు తెలిసిన పార్టీ కాబట్టే పార్టీ జెండాలో నాగలి గుర్తును పెట్టినట్టు చెప్పారు. 

పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆ భూమి ఏమైనా ఆయన తాత ఇచ్చాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూరుడైన జగన్ బొమ్మను రోజూ చూడాలా? అని మండిపడ్డారు. సైకో పాలన వద్దని, సైకిల్ పాలన రావాలని అన్నారు. రైతులు తనతో చెప్పిన సమస్యలన్నీ రాసుకున్నానని, అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వలంటీర్ల వ్యవస్థ పెట్టి రైతులపై పెత్తనం చలాయించేలా చేశారని దుమ్మెత్తి పోశారు.  

ఉత్తరాంధ్రలో తాము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం రూ. 1,550 కోట్లు ఖర్చు పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.  రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు నీరివ్వాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని చూస్తే  పోలవరాన్ని తీసుకెళ్లి గోదావరిలో కలిపేశారని ఆరోపించారు. దేశంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టింది టీడీపీయేనని పేర్కొన్నారు. రైతులను ఈ ప్రభుత్వం వేధించి భయపెడుతోందని ఆరోపించారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు అన్నారు.
Chandrababu
Andhra Pradesh
Vizianagaram
Bobbili
Idem Karma Mana Rythulaku

More Telugu News