COVID19: కోవిడ్ బూస్టర్ డోస్ ఇంకా తీసుకోలేదా..?

  • మొదటి రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోస్
  • రెండో డోస్ తీసుకుని 9 నెలలు నిండితే అర్హత
  • కోవిన్ పోర్టల్ లో లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు
Still not taken Covid booster shot how to book booster vaccine appointment

మన దేశంలో వయోజనుల్లో అధిక శాతం కరోనా టీకా రెండు డోసులను తీసుకున్నారు. అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాలంటూ నిపుణులు సూచించినప్పటికీ ప్రజల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించలేదు. దీనికి కారణం కరోనా మూడో వేవ్ ఒమిక్రాన్ లో తీవ్రత చాలా వరకు తగ్గిపోవడమే. మరణాల రేటు కూడా చాలా స్వల్ప స్థాయికి పరిమితమైంది. దీంతో బూస్టర్ డోస్ కు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు చైనా సహా పలు దేశాల్లో కరోనా బీఎఫ్ 7 వేరియంట్ చాలా ఉధృతంగా ఉండడం, మరణాలు రేటు ఎక్కువగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అప్రమత్తత పెరిగింది.

కనుక బూస్టర్ డోస్ తీసుకోవాలని మరోసారి కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ టీకాను బూస్టర్ డోస్ కింద ఇచ్చేందుకు కేంద్ర సర్కారు అనుమతి మంజూరు చేసింది. కనుక రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవాలంటే, కోవిన్ యాప్ లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. మొదటి రెండు డోసులతో వచ్చిన వ్యాధి నిరోధకత కొంత కాలానికి తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల ఇది తిరిగి బలపడుతుంది. వైరస్ పై పోరాడే విషయంలో మన రోగ నిరోధక వ్యవస్థకు బూస్టర్ డోస్ మద్దతుగా నిలబడుతుంది.

బూస్టర్ డోస్ కోసం కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు. గతంలో రెండు డోసుల సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత బూస్టర్ డోస్ కు అర్హత ఉంటే అక్కడ చూపిస్తుంది. కరోనా రెండో డోస్ తీసుకుని 9 నెలలు అయిన వారు బూస్టర్ డోస్ కు అర్హులు. అర్హత ఉన్నట్టు చూపిస్తే షెడ్యూల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పిన్ కోడ్ నమోదు చేస్తే సమీపంలోని టీకా కేంద్రాల వివరాలు కనిపిస్తాయి. అందులో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో నాసల్ టీకా ను ఇస్తున్నారు. ఇందుకోసం చార్జీ చెల్లించాలి. కొన్ని రోజుల్లో ప్రభుత్వ రంగంలో ఉచితంగా బూస్టర్ డోస్ లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News