TTD: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్ డిమాండ్

  • ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేసిన టీటీడీ
  • 32 నిమిషాల వ్యవధిలోనే బుకింగ్ పూర్తి
  • జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం
  • రోజుకు 20 వేల చొప్పున రూ.300 టికెట్ల జారీ
Vaikunta Dwara Darshanam tickets sold out in 32 minutes

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేసిన 32 నిమిషాల్లోనే స్వామి వారి దర్శనం టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. ఏటా పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వచ్చే నెల జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు తిరుమల ఆలయం వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు జరగనున్నాయి.

ఈ ప్రత్యేక దర్శనానికి సంబంధించి టీటీడీ శనివారం ఆన్ లైన్ లో టికెట్లను జారీ చేసింది. ఉదయం 9 గంటలకు టికెట్లను రిలీజ్ చేయగా.. 32 నిమిషాల్లోనే భక్తులు అన్ని టికెట్లను బుక్ చేసుకున్నారని తెలిపింది. రూ.300 చొప్పున రోజుకు 20 వేల టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఉంచింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఇక, వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులు ఎక్కువ మందికి స్వామి వారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. టికెట్లు పొందిన వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొంది.

జనవరి 2 నుంచి వీఐపీలు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మిగతా అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. టీటీడీ కొత్త ఏడాది క్యాలెండర్ ను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. తిరుమల, తిరుపతితో పాటు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో ఈ క్యాలెండర్లు రెండు రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

More Telugu News