Army: సిక్కింలో ఘోర ప్రమాదం... 16 మంది ఆర్మీ జవాన్ల దుర్మరణం

16 army personnel died in road mishap
  • లోయలో పడిన ఆర్మీ వాహనం
  • నుజ్జునుజ్జయిన ట్రక్కు
  • 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారుల దుర్మరణం
  • నలుగురికి తీవ్ర గాయాలు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాజ్ నాథ్ సింగ్
ఉత్తర సిక్కింలో చైనా సరిహద్దులకు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. వారిలో 13 మంది జవాన్లు కాగా, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు ఉన్నారు. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని హెలికాప్టర్ లో బెంగాల్ లోని ఆసుపత్రికి తరలించారు. 

ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో మిలిటరీ ట్రక్కులో 20 మంది ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ లోయలో పడిపోయింది. ఓ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయినట్టు భావిస్తున్నారు. 100 అడుగుల ఎత్తు నుంచి వాహనం లోయలో పడిపోవడంతో నుజ్జునుజ్జయింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు. 

ఈ విషాద ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Army
Jawans
Death
Road Accident
Sikkim

More Telugu News