Anand Mahindra: చైనా వ్యాక్సిన్ల సత్తా ఏపాటిదో తేలిపోయింది: ఆనంద్ మహీంద్రా

  • చైనాలో కరోనా విలయతాండవం
  • బీఎఫ్-7 వేరియంట్ తో అతలాకుతలం
  • ఆసుపత్రులు కిటకిట.. శ్మశానవాటికల్లోనూ రద్దీ
  • చైనాకు భారత్ వ్యాక్సిన్లు పంపిస్తే బాగుంటుందన్న ఆనంద్
Anand Mahindra says China vaccines not provided much immunity

కరోనా మహమ్మారికి జన్మస్థానంగా నిలిచిన చైనా... ఈ వైరస్ తో మరోసారి యుద్ధం చేస్తోంది. గత కొన్నివారాలుగా చైనాలో లక్షల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నట్టు తెలుస్తోంది. చైనా నగరాల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని, శ్మశానవాటికల్లో విపరీతమైన రద్దీ నెలకొందని కథనాలు వెలువడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. 

ఓ ఆసుపత్రిలో బెడ్ లు ఖాళీగా లేక, కరోనా రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్స ఇస్తున్న ఓ ట్వీట్ ను ఆయన పంచుకున్నారు. దానిపై వ్యాఖ్యానిస్తూ... చైనా వ్యాక్సిన్లతో ఏమాత్రం ఉపయోగం లేదన్న విషయం తేలిపోయిందని వివరించారు. 

"చైనా వ్యాక్సిన్లు కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని అందించలేకపోతున్నాయన్న విషయం స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం మంచి పొరుగుదేశంగా వ్యవహరించలేమా? సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వంటి సంస్థల నుంచి వ్యాక్సిన్లను చైనాకు అందజేయలేమా? ప్రస్తుతం మన వద్ద తగినంతగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి కదా!" అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

More Telugu News