Jagan: కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించిన జగన్, మహేశ్ బాబు

Jagan and Satyanarayana pays condolences to Kaikala Satyanarayana
  • సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలియజేసిన జగన్
  • ఆయనతో మధుర జ్ఞాపకాలు ఉన్నాయన్న మహేశ్
  • సత్యనారాయణగారి మృతి తీరని లోటు అని వ్యాఖ్య
తెలుగు వారు గర్వించదగ్గ సినీ నటుడు కైకాల సత్యనారాయణ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుముఖ కళాకారుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 'గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీగానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.   

టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణగారి మృతి కలచివేస్తోందని మహేశ్ అన్నారు. ఆయనతో కలిసి నటించినప్పటి ఎన్నో మధుర జ్ఞాపకాలు తనకు ఉన్నాయని చెప్పారు. ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. సత్యనారాయణగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
Jagan
YSRCP
Mahesh Babu
Kaikala Satyanarayana

More Telugu News