Photo Exhibition: టీడీపీ కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్... జగన్ అరాచకాలు ప్రజల ముందుంచామన్న నేతలు

  • జగన్ దోపిడీని ఫొటోల రూపంలో ప్రదర్శిస్తున్నామన్న నక్కా
  • టీడీపీ కార్యకర్తలపై జగన్ పగబట్టాడని వెల్లడి
  • ఒక్క ఫొటోకైనా జగన్ సమాధానమివ్వగలరా? అంటూ బొండా ఉమ సవాల్
  • రాష్ట్రంలో నో పోలీస్ అంటూ దేవినేని ఉమ వ్యంగ్యం
Photo exhibition at TDP Office

మూడున్నరేళ్ల పాలనలో జగన్ రెడ్డి అరాచకాలు, విధ్వంసం, దోపిడీ, లూఠీలకు పాల్పడ్డాడంటూ టీడీపీ నేతలు పార్టీ జాతీయ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కుంభకోణాలు, భూకబ్జాలు, లూఠీలతో జగన్ రెడ్డి సాగించిన విశృంఖల దోపిడీని చిత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచామని పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. 

దళితులు, గిరిజనులపై  సాగించిన దమనకాండ, మైనారిటీలపై సాగించిన మారణహోమం, బడుగుబలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించినట్టు వివరించారు. మద్యం, ఇసుక కుంభకోణాల్లో ముఖ్యమంత్రి వేలకోట్లు దోచుకున్న తీరుని కళ్లకు కట్టినట్టు చూపామని, పసుపుపార్టీ కార్యకర్తలపై పగబట్టిన జగన్ రెడ్డి, వారిని ఏవిధంగా అన్యాయంగా బలి తీసుకుంటున్నాడో ఫోటోల ద్వారా చూపామని వెల్లడించారు. 

మాచర్ల ఘటనలో వైసీపీ మూకలు కత్తులతో ఎలా స్వైరవిహారం చేశాయో చెప్పడానికి, ఆ పార్టీ నేత, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు చల్లా మోహన్ కత్తిపట్టుకొని టీడీపీ వారిని హెచ్చరిస్తున్న దృశ్యాలే నిదర్శనమని నక్కా ఆనంద్ బాబు అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొండా ఉమ మాట్లాడుతూ, టీడీపీ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఒక్క ఫోటోకైనా జగన్ సమాధానం చెప్పగలడా? అని సవాల్ విసిరారు. దేవినేని ఉమ స్పందిస్తూ... జగన్ రెడ్డి, వైసీపీ గూండాల దుశ్చర్యలు, దుర్మార్గాలు, దారుణాలు పెచ్చుమీరుతున్నా రాష్ట్రంలో నో పోలీస్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబుకు ఐఎస్ బీ వార్షికోత్సవంలో లభించిన ఆదరణ, ఆయన ఆలోచనా విధానం ప్రజలకు తెలియకూడదనే జగన్ రెడ్డి మాచర్లలో మారణహోమాన్ని సృష్టించాడని ఆరోపించారు. 

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’ కార్యక్రమానికి ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణ చూసి జగన్ లోని సైకో నిద్రలేచాడని విమర్శించారు. 

ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో  టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ,  మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

More Telugu News