Egg: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.. అటువైపు చూసేందుకు కూడా భయపడుతున్న సామాన్యులు!

  • గత నెలలో డజను గుడ్ల ధర రూ. 66
  • ఇప్పుడు ఒక్కో గుడ్డు ధర ఏడు రూపాయలు
  • కోళ్ల దాణా, విద్యుత్ చార్జీలు, కూలి ధరల పెరగడమే కారణం
  • ఏపీలో రోజుకు 5 లక్షల గుడ్ల ఉత్పత్తి
Egg Rates Hiked Due To other expenses

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఠక్కున గుర్తొచ్చేది గుడ్డు. బ్యాచిలర్స్‌కు ఇష్టమైన వంటకం కూడా అదే. దేంట్లోనైనా అది ఇట్టే కలిసిపోతుంది. ఆమ్లెట్‌గా ఒదిగిపోతుంది. అందరికీ అందుబాటులో ఉండడమే కాదు, ఆరోగ్యం కూడా. నిన్నమొన్నటి వరకు నాలుగైదు రూపాయలున్న గుడ్డు ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. బహిరంగ మార్కెట్లో ఏకంగా ఏడు రూపాయలకు పెరగడంతో సామాన్యులు అటువైపు చూడాలంటేనే భయపడుతున్నారు. ఏపీలో 100 గుడ్ల ధర గరిష్ఠంగా రూ. 547 పలుకుతోంది. ఫామ్‌‌గేట్‌లో గుడ్డు రేటు రూ. 5.34 మాత్రమే. అయినప్పటికీ హోల్‌సేల్‌గా డజను గుడ్ల ధర రూ. 78గా ఉంది. దీంతో రవాణా ఖర్చులు కలుపుకుని ఒక్కో గుడ్డును వ్యాపారులు రూ. 7కు విక్రయిస్తున్నారు. 

గత నెలలో డజను గుడ్ల ధర రూ. 66గా ఉండగా ఇప్పుడు గుడ్డుకు రూపాయి పెంచి విక్రయిస్తున్నారు. కోళ్ల దాణా ధరలు పెరగడం, విద్యుత్ చార్జీలు, కూలి రేట్లు కారణంగానే ధరలు పెరిగినట్టు ఫామ్ యజమానులు చెబుతున్నారు. ధరల భారాన్ని తగ్గించుకునేందుకు కోళ్ల రైతులు గుడ్డుపై అర్ధ రూపాయి పెంచగా, వ్యాపారులు మరో అర్ధ రూపాయి పెంచి విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 27 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో ఒక్క ఏపీలోనే 5 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఏపీ నుంచి సగానికి పైగా గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

More Telugu News