Team India: ఎట్టకేలకు పుంజుకున్న భారత బౌలర్లు.. వెంటవెంటనే రెండు వికెట్లు

  • నాలుగో రోజు తొలి సెషన్ లో ఒక్క వికెట్ దక్కని వైనం
  • లంచ్ తర్వాత జోరు పెంచిన భారత బౌలర్లు
  • ఓపెనర్ శాంటో, యాసిర్ అలీ ఔట్ 
india takes two wickets after lunch break

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయానికి చేరువ అవుతోంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో  46 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన భారత బౌలర్లు పుంజుకున్నారు. వెంట వెంటనే రెండు వికెట్లు రాబట్టి బంగ్లాదేశ్ ను ఒత్తిడిలోకి నెట్టారు. చత్తోగ్రామ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ ఇచ్చిన  513 పరుగుల లక్ష్యంతో ఓవర్ నైట్ స్కోరు 42/0తో బంగ్లా శనివారం, నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు కుప్పకూలిన విధానం చూస్తే రెండో ఇన్నింగ్స్ కూడా ఎంతోసేపు నిలువదనిపించింది. 

కానీ, నాలుగో రోజు ఆటలో ఆ జట్టు ఓపెనర్లు నజ్ముల్ శాంటో (67), జాకిర్ హసన్ (65 బ్యాటింగ్) దీటుగా పోరాడారు. తొలి సెషన్ లో వికెట్ ఇవ్వకుండా మొదటి వికెట్ కు 100 పైచిలుకు భాగస్వామ్యం నమోదు చేశారు. దాంతో, బంగ్లాదేశ్  లంచ్ టైమ్ కు వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది. అయితే, లంచ్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. విరామం నుంచి వచ్చిన వెంటనే శాంటోను ఉమేశ్ యాదవ్.. ఔట్ చేశాడు. 

దాంతో, తొలి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మూడు ఓవర్ల తర్వాత వన్ డౌన్ బ్యాటర్ యాసిర్ అలీ (5)ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం 55 ఓవర్లలో బంగ్లా 140/2 స్కోరుతో నిలిచింది. ఆ జట్టు విజయానికి ఇంకా 373 పరుగులు అవసరం కాగా, భారత్ కు మరో ఎనిమిది వికెట్లు కావాలి.

More Telugu News