రైలులో వాటర్ బాటిల్ పై రూ.5 ఎక్కువ వసూలు చేసినందుకు లక్ష ఫైన్!

  • రైలులో ఎమ్మార్పీకన్నా ఎక్కువ ధరలకు వాటర్ బాటిల్స్ అమ్మకం
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్యాసింజర్
  • వైరల్ కావడంతో స్పందించి విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
  • రైల్వే కాంట్రాక్టర్ కు జరిమానా విధించిన ఐఆర్ సీటీసీ
IRCTC has imposed a fine of Rs 1 lakh for charging Rs 5 more per water bottle

రైలు ప్రయాణాల్లో ఏం కొనాలన్నా అమ్మేవాడి దయ.. మన ప్రాప్తం అన్నట్లు ఉంటుంది. ప్రత్యామ్నాయం లేక వాళ్లు చెప్పినంత రేటు చెల్లించి తీసుకోవాల్సి వస్తోంది. ఎమ్మార్పీ ఎంతున్నా వాళ్లు అడిగినంతా ఇవ్వాల్సిందే. హర్యానాకు చెందిన ఓ ప్యాసింజర్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైతే సదరు రైల్వే కాంట్రాక్టర్ కు గట్టి గుణపాఠం నేర్పాడు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటుకు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నాడంటూ వీడియో తీసి రైల్వే ఉన్నతాధికారులకు పంపించాడు. 

దీంతో ఆ కాంట్రాక్టర్ కు భారీ మొత్తంలో జరిమానా విధించారు ఉన్నతాధికారులు. హర్యానాకు చెందిన శివం భట్ ఇటీవల లక్నో ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించాడు. చండీగఢ్ నుంచి షాజహాన్ పూర్ కు వెళుతున్నాడు. రైలు ప్రయాణం మధ్యలో దాహమేసి ఓ వాటర్ బాటిల్ కొనేందుకు ప్రయత్నించాడు. అయితే, బాటిల్ పై ఎమ్మార్పీ రూ.15 మాత్రమే ఉండగా.. బాటిల్ ను రూ.20 కి అమ్ముతున్నారని గుర్తించాడు. ఇదేంటని అడిగితే.. కావాలంటే తీసుకో, లేదంటే వదిలెయ్ అన్నట్లు జవాబిచ్చాడా కుర్రాడు. 

మరో దారిలేక అడిగినంతా ఇచ్చి శివం భట్ వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అయితే, ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. ఆపై దానిని రైల్వే ఉన్నతాధికారులకు పంపించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారి రైల్వే ఉన్నతాధికారులకూ చేరడంతో వారు స్పందించారు. లక్నో ఎక్స్ ప్రెస్ లో నీళ్ల బాటిళ్ల అమ్మకానికి లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ ను అరెస్టు చేశారు. ఎమ్మార్పీకన్నా ఎక్కువ ధరలకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నందుకు రూ.లక్ష జరిమానా విధించారు.

More Telugu News