UN: ఉగ్రవాదంపై ప్రశ్నించిన పాక్ జర్నలిస్టుకు మంత్రి జైశంకర్ కౌంటర్

Jaishankar s sharp retort to Pak journalist over question on terrorism at UN
  • ఈ ప్రశ్న అడగాల్సిన మంత్రి వేరే ఉన్నారని విలేఖరికి చురకలు
  • ఉగ్రవాదాన్ని ఇంకెన్నాళ్లు ప్రోత్సహిస్తారని పాక్ మంత్రిని అడగాలని సూచన
  • పెరట్లో పాములు పెంచుతూ పక్కింటి వాళ్లను మాత్రమే కాటేయాలని ఆశించొద్దని హితవు
ఉగ్రవాదంపై తనను ప్రశ్నించిన ఓ పాకిస్థాన్ విలేఖరికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా జవాబిచ్చారు. అడుగుతున్న ప్రశ్న కరెక్టే కానీ మీరు అడగాల్సిన మంత్రి వేరే ఉన్నారంటూ పరోక్షంగా పాకిస్థాన్ మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికపై ఈ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ఉగ్రవాద నియంత్రణకు ఎదురవుతున్న సవాళ్లపై భద్రతా మండలిలో జరిగిన ఓ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు.

ఇంతలో పాకిస్థాన్ కు చెందిన ఓ విలేఖరి.. దక్షిణాసియాలో ఉగ్రవాదం ఇంకెంత కాలం కొనసాగుతుంది? న్యూఢిల్లీ, కాబూల్, పాకిస్థాన్ లలో ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు? అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. మీరు అడగాల్సిన మంత్రి నేను కాదు. ఇదే ప్రశ్నను పాకిస్థాన్ మంత్రిని అడగాలి అని సూచించారు. ఉగ్రవాదాన్ని ఇంకెన్నాళ్లు ప్రోత్సహిస్తుందని పాకిస్థాన్ మంత్రిని అడగాలని చెప్పారు. తద్వారా పాక్ ఉగ్రవాదులకు మద్ధతుగా ఉన్నంతకాలం దక్షిణాసియాలో ఉగ్రదాడులను నియంత్రించలేమని జైశంకర్ తేల్చిచెప్పారు.

అంతకుముందు ఇదే సమావేశంలో మంత్రి జైశంకర్ మాట్లాడుతూ అమెరికా మాజీ ప్రెసిడెంట్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘పెరట్లో పాములు పెంచుతూ పక్కింటి వాళ్లను మాత్రమే కాటేయాలని కోరుకోవడం మూర్ఖత్వం’ అని చెప్పారు. మన పెరట్లో, మనం పెంచుతున్న పాములు కాబట్టి మనల్ని వదిలేసి పక్కింటి వాళ్లనే అవి కాటేస్తాయని ఆశించడం తప్పని చెప్పారు. వాటికి అలాంటి భేదాలేవీ ఉండవని, తమకు అందుబాటులో ఉన్న వారిని కాటేస్తాయని మంత్రి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కూడా ఇలాంటిదేనని మంత్రి జైశంకర్ చెప్పారు.
UN
jaishankar
pak journalist
terrorism
southasia

More Telugu News