France: సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫైనల్‌కు ఫ్రాన్స్

  • మొరాకోను 2-0తో చిత్తు చేసిన ఫ్రాన్స్
  • ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్‌లో తలపడనున్న డిఫెండింగ్ ఛాంపియన్
  • ఓడినా చరిత్ర సృష్టించిన మొరాకో
France end Moroccos fairytale run to set up World Cup final against Argentina

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. మొరాకోతో జరిగిన సెమీస్‌లో 2-0తో విజయం సాధించి ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలి నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన ఫ్రాన్స్ ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే ఫ్రాన్స్ ఆటగాడు థియో హెర్నాండెజ్ అద్భుత గోల్‌తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత తొలి అర్ధ భాగంలో మరో గోల్ నమోదు కాలేదు. ఫ్రాన్స్ ఆటగాళ్లు మొరాకో గోల్ పోస్టులపై పలుమార్లు దాడులు చేసినప్పటికీ గోల్స్ మాత్రం సాధించలేకపోయారు. 79వ నిమిషం వద్ద రాండల్ కోలో మువానీ గోల్ సాధించడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 2-0కు పెరిగింది. 

మరోవైపు, మ్యాచ్‌లో చాలా భాగం బంతి మొరాకో నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. మూడుసార్లు టార్గెట్‌వైపు దూసుకెళ్లినప్పటికీ గోల్ కొట్టడంలో మాత్రం సఫలం కాలేకపోయారు. గ్రూప్ స్థాయి, నాకౌట్ మ్యాచుల్లో బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ వంటి బలమైన జట్లను కంగుతినిపించిన మొరాకో.. ఆఫ్రికా నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. కాగా, ఆదివారం జరగనున్న ఫైనల్‌లో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడుతుంది.

More Telugu News