TTD: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్షపై అప్పీలు.. నేడు హైకోర్టు విచారణ

  • 2011లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్
  • తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఉద్యోగులు
  • ముగ్గుర్నీ రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించిన హైకోర్టు
  • హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోని టీటీడీ
  • ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించిన హైకోర్టు
TTD EO Dharma Reddy imprisonment for court contempt

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నెల రోజుల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 2 వేల జరిమానాను విధించింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. ఈ నెల 27లోపు హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ధర్మారెడ్డికి ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు నిన్న హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ కె.మన్మథరావు తీర్పును వెలువరించారు. 

వివరాల్లోకి వెళ్తే... 2011లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, అప్పటికే 17 ఏళ్లుగా ప్రోగ్రాం అసిస్టెంట్లుగా పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు సేవ్లా నాయక్, ఆర్ స్వామి నాయక్, కొమ్ము బాబు ఈ నోటిఫికేషన్ ను కోర్టులో సవాల్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేసేలా టీటీడీని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... టీటీడీ నోటిఫికేషన్ ను కొట్టి వేసింది. పిటిషనర్లను రెగ్యులరైజ్ చేయాలని టీటీడీని ఆదేశించింది. 

అయితే హైకోర్టు ఆదేశాలను టీటీడీ పట్టించుకోలేదు. దీంతో, హైకోర్టు ఆదేశాలను టీటీడీ అమలు చేయలేదంటూ ఆ ముగ్గురు పిటిషన్ దారులు ఈ ఏడాది జూన్ లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై టీటీడీ కౌంటర్ దాఖలు చేసింది. జూన్ 20న హైకోర్టు ఉత్తర్వులపై తాము అప్పీలు చేశామని, అది పెండింగ్ లో ఉందని, ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కేసుగా విచారణ చేయకూడదని ఈవో ధర్మారెడ్డి తరపు న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల అమలుకు టైమ్ పీరియడ్ ను విధించలేదని చెప్పారు. ఆ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 

ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ వేసిన కౌంటర్ ను తాము పరిశీలించామని... తమ ఆదేశాల అమలు విషయంలో ప్రతివాదుల వైఖరి ఏమిటో కౌంటర్ లో అర్థమవుతోందని అన్నారు. తమ ఆదేశాలను గరిష్ఠంగా రెండు నెలల్లోగా అమలు చేయాలని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తమ ఆదేశాలను పక్కన పెట్టేశారని... కోర్టు ధిక్కరణ కింద ఈవో ధర్మారెడ్డి శిక్షకు అర్హులే అని అన్నారు. అనంతరం ధర్మారెడ్డికి జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. 

ఆ వెంటనే టీటీడీ తరపు న్యాయవాది సింగిల్ జడ్జి తీర్పుపై అత్యవసర విచారణ జరపాలని కోర్టును కోరారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై ఈ రోజు విచారణ జరపనుంది. మరోపక్క, ముగ్గురు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ధర్మాసనం విధించింది. 

More Telugu News