Team India: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

India won the toss and elected to bat first in first test against bangladesh
  • ఉమేశ్ యాదవ్‌కు తుది జట్టులో చోటు
  • బెంచ్‌కు పరిమితమైన జయదేవ్ ఉనద్కత్
  • టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై ఓటమి ఎరుగని భారత్
  • ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న టీమిండియా
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చాటోగ్రామ్‌లో తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో జట్టుకు దూరమైన మహ్మద్ షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు తుది జట్టులో చోటు లభించగా, జయదేవ్ ఉనద్కత్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. ముగ్గురు స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్‌‌లను భారత్ బరిలోకి దించింది. అలాగే, మీడియం పేసర్లు మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లకు పేస్ దళాన్ని నడిపించనున్నారు. 

బొటన వేలి గాయం కారణంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పటికే జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్ అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఇందులో భారత్ ఫైనల్‌కు చేరాలంటే మిగతా ఆరు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. కాబట్టి బంగ్లాతో జరిగే రెండు టెస్టులు భారత్‌కు ఎంతో కీలకం. కాగా, టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఇప్పటి వరకు ఓటమి ఎరుగదు. కాబట్టి ఈ సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భారత్ యోచిస్తోంది.

కాగా, బంగ్లాదేశ్‌ క్రికెటర్ జకీర్ హసన్‌ ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిశాయి. భారత్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. గిల్ 16, రాహుల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Team India
Bangladesh
Test Match
KL Rahul

More Telugu News