Cigarette: సిగరెట్లు విడిగా అమ్మడంపై నిషేధం.. కేంద్రం యోచన

  • పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు మేరకు కేంద్రం నిర్ణయం
  • వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసే అవకాశం
  • సిగరెట్ల కారణంగా దేశంలో ఏటా 3.5 లక్షల మంది మృత్యువాత
Sale of single cigarettes to be banned by Parliament to reduce tobacco consumption

సిగరెట్లను విడిగా విక్రయించడంపై నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సిగరెట్లను లూజుగా విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. సిగరెట్లను లూజుగా విక్రయిస్తుండడంతో పొగాకు వినియోగం ఏమాత్రం తగ్గడం లేదని పేర్కొంది. పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది మరణిస్తున్నట్టు తెలిపింది. 

పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు పన్నులు పెంచుతున్నా ఫలితం ఉండడం లేదని కమిటీ అభిప్రాయపడింది. సిగరెట్‌పై ప్రస్తుతం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉందని, అలాగే కాంపెన్సేషన్ సెస్ కూడా ఉందని తెలిపింది. మొత్తంగా 290 శాతం వరకు ఎక్సైజ్ సుంకం ఉంది. అన్నీ కలిపి లెక్కిస్తే ఒక్కో సిగరెట్ ధరలో 64 శాతం వరకు పన్ను ఉంటుంది. అయితే, ఇవేవీ సిగరెట్ల వినియోగాన్ని నియంత్రించలేకపోతున్నాయి. సిగరెట్ వినియోగంతో నోటి క్యాన్సర్ ముప్పు కూడా అంతకంతకూ పెరుగుతోంది. 

గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సిగరెట్లపై పన్ను భారాన్ని 75 శాతం వరకు పెంచాలని సూచించింది. కమిటీ సిఫార్సుల నేపథ్యంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో లూజ్ సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేస్తారని సమాచారం.

More Telugu News