Yanamala: పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోంది: యనమల

  • ఏపీలో మరికొన్ని నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • అనర్హులను ఓటర్ల జాబితాలో చేర్చారన్న యనమల
  • ఐదు, పది, ఇంటర్ చదివిన వాళ్లను కూడా చేర్చారని ఆరోపణ
  • ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
TDP leader Yanamala slams YCP over MLC voter registration

పట్టభద్రుల ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. 

ఒకే వ్యక్తి పేరు రెండు మూడు సార్లు నమోదు చేశారని, ఐదు, పది, ఇంటర్ చదివిన వారిని కూడా జాబితాలో చేర్చి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాలంటీర్లకు లక్ష్యాలు పెట్టి మరి అనర్హులతో ఓటర్ల జాబితా రూపొందించారని యనమల మండిపడ్డారు.

"వైసీపీ అక్రమాలకు సహకరించి అధికారులు బలికావద్దు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి. మేధావులు, విద్యావంతులు పాల్గొనే ఎన్నికలను కూడా ప్యూడల్ ధోరణితో తీర్పును కొల్లకొట్టాలని చూస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో దాదాపు 10 వేల మందికి పైగా అనర్హులను ఓటర్ జాబితాలో చేర్చారు. కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోను భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. 

అధికార పార్టీ తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నా అధికార పార్టీ లెక్కచేయడం లేదు. రాష్ట్రం మొత్తంలో దాదాపు 50 వేల బోగస్ ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల సంఘం వెంటనే బోగస్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించాలి. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా కట్టడి చేయాలి. లేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది" అని వ్యాఖ్యానించారు.

More Telugu News