Cyclone Mandous: ఏపీని అతలాకుతలం చేసిన మాండూస్ తుపాను.. నేడు కూడా వర్షాలు!

  • తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ తదితర జిల్లాల్లో తుపాను బీభత్సం
  • శ్రీకాళహస్తి-తడ మార్గంలో సున్నపు కాల్వపై చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు
  • వర్షాల కారణంగా తమిళనాడులో నలుగురి మృతి
  • వేలాది ఎకరాల్లోని పంటలు వర్షంపాలు
Cyclone Mandous Effect Heavy Rains Lashes Andhra and Tamil Nadu

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలపై మాండూస్ తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీకాళహస్తి-తడ మార్గంలో సున్నపుకాల్వపై బస్సు ఇరుక్కుపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్-రేణిగుంట-ఇండిగో విమానం రద్దయింది.

చేపల వేటకు వెళ్లి చిక్కుకుపోయిన జాలర్ల గుర్తింపు
తిరుమల ఘాట్ రోడ్డులో వృక్షాలు కూలడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు మెట్ల మార్గం వైపు నుంచి భక్తులను అనుమతించలేదు. బాపట్ల జిల్లా చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు  మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం తీరానికి రెండు కిలోమీటర్ల తీరంలో వారిని గుర్తించిన అధికారులు వారిని సురక్షితంగా తీరానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఆరు రోజుల క్రితమే వేటకు వెళ్లగా తుపాను ప్రభావంతో సిగ్నళ్లు లేక దారి తెలియక చిక్కుకుపోయారు. సిగ్నళ్లు అందిన తర్వాత మెరైన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారి జాడ తెలిసింది.

ధ్వంసమైన పంటలు
పలు జిల్లాల్లోని వరి, అరటి, పత్తి, వేరుశనగ, మినుము, బొప్పాయి, మిరప సహా వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం దర్జిపల్లిలో ఓ ఇంటిగోడ కూలి ఓ మహిళ మృతి చెందింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వర్షం బీభత్సం సృష్టించింది. ఇక్కడ శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం నాటికి ఏకంగా 281 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కోస్తాలోనూ ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మాండూస్ తుపాను నిన్న సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

చెన్నైలో కూలిన 350 వృక్షాలు
తమిళనాడును తుపాను అతలాకుతలం చేసింది. పలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. శనివారం తెల్లవారుజామున 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చెన్నైలో 350కిపైగా చెట్లు నేలకూలాయి. 30 వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మడిప్పాక్కంలో వర్షాలకు గుడిసె కూలి లక్ష్మి (45), ఆమె అన్న కుమారుడు (25) ప్రాణాలు కోల్పోయారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరు సమీపంలోని పిళ్లైపాక్కంలో విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు యువకులు మరణించారు.

More Telugu News