YS Sharmila: షర్మిల ఆమరణ దీక్షను అర్ధరాత్రి భగ్నం చేసిన పోలీసులు.. అపోలో ఆసుపత్రికి తరలింపు

  • అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లోటస్ పాండ్‌కు పోలీసులు
  • బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకున్న వైనం
  • షర్మిలకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న తల్లి విజయలక్ష్మి
YS Sharmila hunger strike broken by police

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెండు రోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షను గత అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. గత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లోటస్ పాండ్‌కు చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని అంతకుముందు షర్మిల తేల్చి చెప్పారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. శుక్రవారం తమ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారానికి కూడా విడుదల చేయలేదని, పాత కేసులు తవ్వి వారిని రిమాండ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

తన పాదయాత్రలో ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యాలయం చుట్టూ కర్ఫ్యూ ఎత్తివేసి, అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేసే వరకు దీక్షను ఆపబోనని స్పష్టం చేశారు. కాగా, షర్మిలకు మద్దతుగా ఆమె తల్లి విజయలక్ష్మి కూడా దీక్షలో పాల్గొన్నారు.

More Telugu News