Rohit Sharma: బంగ్లాతో మూడో వన్డే, టెస్టు సిరీస్ కు రోహిత్ దూరం

  • చికిత్స కోసం స్వదేశానికి తిరిగొస్తున్న కెప్టెన్
  • కోలుకునేందుకు 3–4 వారాలు పట్టే అవకాశం
  • గాయాలతో దీపక్ చహర్, కుల్దీప్ సేన్ కూడా మూడో వన్డేకు దూరం  
Rohit likely to miss Bangladesh Test series with finger dislocation

తీవ్ర గాయం అయిన బొటన వేలుకు కుట్లు పడ్డా, నొప్పిని భరిస్తూనే రెండో వన్డేలో వీరోచితంగా బ్యాటింగ్ చేసిన భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ బంగ్లాదేశ్ తో చివరి వన్డేతో పాటు టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. గాయానికి చికిత్స కోసం రోహిత్ ఈ పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. ముంబైలో వైద్య నిపుణులను కలుస్తాడని భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ చెప్పాడు. సిరాజ్‌ వేసిన రెండో ఓవర్లో  బంగ్లా ప్లేయర్‌ అనామల్ హక్‌ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్‌ వదిలేయగా.. ఆ బాల్‌ అతని ఎడమ చేతి బొటన వేలుకు గట్టిగా తగిలింది. మైదానం వీడిన రోహిత్‌ వెంటనే ఢాకాలోని హాస్పిటల్‌లో స్కానింగ్‌ చేయించుకున్నాడు. 

ఎముక కదిలిందని, వైద్యులు కుట్లు వేశారని మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ చెప్పాడు. ఎముక విరుగక పోవడంతో బ్యాటింగ్‌ చేయగలిగానన్నాడు. అయితే, ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం 3 నుంచి 4 వారాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాగా, కండరాల నొప్పి వల్ల రెండో వన్డేలో మూడు ఓవర్లు మాత్రమే వేయగలిగిన పేసర్ దీపక్‌ చహర్‌, వెన్నునొప్పితో ఈ మ్యాచ్ లో ఆడకలేకపోయిన మరో యువ పేసర్ కుల్దీప్‌ సేన్‌ మూడో వన్డేకు దూరంగా ఉంటారని కోచ్ ద్రవిడ్ చెప్పాడు. దాంతో, ఇప్పటికే బంగ్లాదేశ్ కు సిరీస్ కోల్పోయిన భారత్ ముగ్గురు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది.

More Telugu News