RRR: 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి హాలీవుడ్ పురస్కారం

  • ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్
  • తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుకు ఎంపిక
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న అవార్డు ప్రదానం
  • సంతోషంతో పొంగిపోతున్న ఆర్ఆర్ఆర్ టీమ్
RRR wins Hollywood Critics Spotlight award

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందుతోంది. విదేశాల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాదు, పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమైంది. ఇటీవల గోవాలో జరిగిన ఇఫీ ఫిలిం ఫెస్టివల్ లోనూ ఆర్ఆర్ఆర్ సందడి చేసింది. 

తాజాగా ఈ చిత్రానికి మరో విశిష్ట గుర్తింపు లభించింది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్ సీఏ) 'స్పాట్ లైట్ విన్నర్' అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు అవార్డు నిర్వాహకులు 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందానికి సమాచారం అందించారు. 2023 ఫిబ్రవరి 23న లాస్ ఏంజెల్స్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ సంతోషంతో పొంగిపోతోంది. ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు హెచ్ సీఏ జ్యూరీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు 'ఆర్ఆర్ఆర్' బృందం ట్వీట్ చేసింది. 

ఇటీవలే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళిని ఎంపిక చేయడం తెలిసిందే. రాజమౌళికి అవార్డు ప్రకటించిన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 

ఈ సర్కిల్ ద్వారా అవార్డు అందుకుంటే ఆస్కార్ కు దాదాపు చేరువైనట్టేనని భావిస్తారు. 1935 నుంచి ఈ క్రిటిక్స్ సర్కిల్ నుంచి అవార్డులు అందుకున్న వారిలో 43 శాతం మందిని ఆస్కార్ వరించింది. మరి రాజమౌళి, ఆర్ఆర్ఆర్ ల అదృష్టం ఎలా ఉందో చూడాలి.

More Telugu News