జూదానికి బానిసై.. ఇంటి యజమానితో 'లూడో'లో తనను తానే పణంగా పెట్టుకుని ఓడిపోయిన మహిళ!

05-12-2022 Mon 14:35 | Offbeat
  • ఉత్తరప్రదేశ్ లోని  ప్రతాప్ గఢ్ లో  ఘటన
  • భర్త పంపిస్తున్న డబ్బులతో ప్రతి రోజూ జూదం ఆడిన మహిళ
  • మొత్తం పోవడంతో ఇంటి యజమానితో తనను తానే పణంగా పెట్టి లూడో ఆడిన వైనం
UP woman bets self in game of Ludo after running out of money loses to landlord
ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడిన కొందరు ఎంతదూరమైనా వెళ్తున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ లో జూదం ఆడేవాళ్లు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ మహిళ జూదానికి అలవాటు పడింది. డబ్బులు మొత్తం పోగొట్టుకుంది. చివరకు తనను తానే పణంగా పెట్టుకుని తన యజమాని వద్ద మరోసారి పందెం కట్టింది. అందులో ఓడిపోయి భర్తను వదిలేసి అతనికి దగ్గరకు వెళ్లిపోవాల్సి వచ్చింది. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో పనిచేస్తున్న తన భర్త పంపిన డబ్బుతో రేణు అనే మహిళ జూదం ఆడేది. లూడో గేమ్‌కు బానిసైన ఆమె తన ఇంటి యజమానితో రోజూ ఆట ఆడేది. ఓరోజు ఇద్దరూ ఆటలు ఆడుతూ బెట్టింగ్‌లు కడుతున్నప్పుడు ఆ మహిళ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకుంది. చివరకు తననే పణంగా పెట్టుకుంది. అందులో కూడా ఓడిపోయింది. 

ఈ విషయాన్ని రేణు తన భర్తకు ఫోన్ చేసి జరిగిన మొత్తం చెప్పింది. ఆమె భర్త ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను దేవ్‌కలిలో అద్దె ఇంట్లో ఉండేవాడినని రేణు భర్త పేర్కొన్నాడు. ఆరు నెలల క్రితం, అతను జైపూర్‌కు పని కోసం వెళ్లి తన భార్యకు డబ్బు పంపిస్తూనే ఉన్నాడు. ఆ మొత్తాన్ని రేణు జూదం కోసం ఉపయోగించింది. డబ్బు అయిపోయిన తర్వాత ఆమె లూడోలో పందెం కాసి తనను తాను కోల్పోయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త చెప్పిన ప్రకారం, మహిళ ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవిస్తోంది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంటి యజమానిని సంప్రదిస్తున్నట్టు తెలిపారు.