తెలంగాణ ప్రభుత్వం మిక్కిలి సంతోషంతో నిత్యం జగన్ రెడ్డి ఫోటోకు నమస్కరిస్తోంది: ధూళిపాళ్ల నరేంద్ర

03-12-2022 Sat 16:36 | Andhra
  • తెలంగాణలో అమరరాజా పెట్టుబడులు
  • వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన టీడీపీ
  • పారిశ్రామికవేత్తలపై జగన్ కక్షగట్టారన్న ధూళిపాళ్ల 
Dhulipalla Narendra press meet
జగన్ రెడ్డి జేట్యాక్స్, వైసీపీ నేతల వేధింపులు, ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం కుదేలైందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. అమరరాజా గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. 

తన కంపెనీలు, తన బినామీ సంస్థలు తప్ప, రాష్ట్రంలో ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా పారిశ్రామికవేత్తలపై జగన్ కక్షకట్టారని అన్నారు. ప్రభుత్వ సలహాదారులే పారిశ్రామికవేత్తలను భయపెట్టేలా మాట్లాడుతుంటే, ఏపీకి పెట్టుబడులు, ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ తెలంగాణకు పోవడానికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, అమర్ రాజా బ్యాటరీస్ యాజమాన్యాన్ని ప్రభుత్వం దారుణంగా వేధించబట్టే, వారు తెలంగాణకు వెళ్లిపోయారని అన్నారు. జగన్ రెడ్డి దెబ్బకు ఎఫ్డీఐల ఆకర్షణలో ఏపీ దేశంలోనే అట్టడుగుస్థానానికి దిగజారిందని పేర్కొన్నారు. 

"ఏపీలో కప్పం కట్టలేకే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నామని పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే చెబుతున్నారు. ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ జగన్ దెబ్బకు పొరుగురాష్ట్రాల బాట పడుతుంటే, ఆయన సొంత కంపెనీలు, బినామీల కంపెనీలు మాత్రం దేదీప్యమానంగా కళకళలాడుతున్నాయి. ఏపీ సీఎం తీరుతో రాష్ట్ర పారిశ్రామికవేత్తలు ఆయనకు దండం పెడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మిక్కిలి సంతోషంతో నిత్యం జగన్ రెడ్డి ఫోటోకు నమస్కరిస్తోంది" అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ తో పోటీపడిన ఏపీ, జగన్ జమానాలో దేశంలోనే అథమస్థానానికి చేరి 14వ స్థానానికి దిగజారిందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 2014-19 మధ్యన 237 భారీ, మధ్యతరహా పరిశ్రమలు రూ.62,523 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ తో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని, దాదాపు 93,200 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని వివరించారు.  

వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.35 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని, 33,500 మందికి మాత్రమే ఉపాధి కల్పించారని తెలిపారు. 

"టీడీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన లులూ గ్రూప్, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరప్రదేశ్ కు తరలిపోయింది. జాకీ సంస్థ కూడా వైసీపీ ప్రభుత్వ వేధింపులు, స్థానిక ప్రజాప్రతినిధుల దోపిడీ తట్టుకోలేకే ఏపీకి గుడ్ బై చెప్పింది. కియా పరిశ్రమను చంద్రబాబుగారు అనంతపురంలో ఏర్పాటుచేస్తే, సదరు సంస్థ అనుబంధ పరిశ్రమలు మాత్రం ఏపీకి రాకుండా తమిళనాడుకి తరలిపోయాయి" అని ధూళిపాళ్ల వివరించారు.