ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముగ్గురు సీఎంల పాత్ర ఉంది: తరుణ్ చుగ్

03-12-2022 Sat 14:50 | Telangana
  • స్కామ్ లో తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంల పాత్ర ఉందన్న తరుణ్ చుగ్
  • ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాలని వ్యాఖ్య
  • చట్టం ముందు అందరూ సమానమేనన్న తరుణ్
3 CMs are behind liquor scam
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తెలంగాణ, ఏపీల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న ఆమె సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఇన్చార్జీ తరుణ్ చుగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ కుంభకోణంలో పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీపై లోతైన దర్యాప్తు జరగాలని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని... ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన వారు చట్టానికి అతీతులు కారని అన్నారు. కుటుంబ పాలనలో అవినీతికి ఇది నిదర్శనమని చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఫోన్లను ధ్వంసం చేశారని అన్నారు.