Gudivada Amarnath: ఏపీ నుంచి వెళ్లిపోతున్నామని అమరరాజా ప్రతినిధులు ఎక్కడైనా చెప్పారా?: మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath condemns remarks over Amararaja issue
  • తెలంగాణలో అమరరాజా పరిశ్రమ
  • టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం
  • ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయన్న చంద్రబాబు
  • పలు పత్రికల్లోనూ కథనాలు
  • తీవ్రంగా స్పందించిన మంత్రి అమర్నాథ్
అమరరాజా గ్రూప్ తెలంగాణలో ఈవీ బ్యాటరీల పరిశ్రమ నెలకొల్పేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ నుంచి పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయని, అమరరాజాను ఏపీ ప్రభుత్వం వేధించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అటు, ప్రధాన పత్రికల్లోనూ ఇదే అంశం మీద వైసీపీ ప్రభుత్వంపై కథనాలు వచ్చాయి. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. 

హెరిటేజ్ వ్యాపార సామ్రాజ్యం అంతా ఏపీలోనే ఉంది కదా? 

ఏపీ నుంచి పెట్టుబడులు తరలివెళుతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారం ఏపీలోనే ఉందని, ఆయనను ఏమైనా ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఈ రాష్ట్రంపై ప్రేమ లేకపోవచ్చు... వారి కంపెనీ కార్పొరేట్ ఆఫీసు హైదరాబాదులో ఉండొచ్చు... కానీ హెరిటేజ్ వ్యాపార సామ్రాజ్యం అంతా ఏపీలోనే ఉంది కదా? అని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబుకు మద్దతుగా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈనాడు, ప్రియ, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు సజావుగానే నడుస్తున్నాయని, ఒకవేళ ప్రభుత్వం ఇబ్బందిపెడితే ఈ సంస్థలు ఎలా నడుస్తున్నాయని అన్నారు. 

అమరరాజా గ్రూప్ ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఏపీ నుంచి వెళ్లిపోయినట్టా? అని మంత్రి ప్రశ్నించారు. అమరరాజా గ్రూప్ కు చెందిన పరిశ్రమలు ఇప్పటికీ ఏపీలో నడుస్తున్నాయని, వాటికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయని వివరించారు. 

ఎల్లో మీడియా మాత్రం విష ప్రచారం

"అమరరాజా ఏపీలోనే కార్యకలాపాలు సాగించాలని చట్టంలో ఎక్కడైనా ఉందా? అమరరాజా సంస్థ టీడీపీకి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడిది కాబట్టే ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. ఏపీ నుంచి తాము వెళ్లిపోతున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ఎక్కడైనా మాట్లాడారా అంటే అదీ లేదు. పరిశ్రమల విషయాన్ని జగన్ ప్రభుత్వం ఎప్పుడూ రాజకీయ కోణంలో చూడలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం విష ప్రచారం చేస్తోంది" అని మండిపడ్డారు.
Gudivada Amarnath
Amararaja
Chandrababu
Media
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News