ప్రభాస్ ‘రాజా డీలక్స్’ సినిమాకు పది కోట్లతో థియేటర్ సెట్!

03-12-2022 Sat 13:38 | Entertainment
  • రాధేశ్యామ్ తో నిరాశ పరిచిన రెబల్ స్టార్
  • మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ లో నటిస్తున్న ప్రభాస్
  • విలన్ గా సంజయ్ దత్!
 Producer Spending 10 Crores on Old Theatre For Prabhas
‘రాధేశ్యామ్’ ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా మంచి హిట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలున్నాయి. ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకొని వీఎఫ్ఎక్స్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలాల్, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. మరోవైపు మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కోసం ప్రత్యేక సెట్ వేస్తున్నారు. వాడుకలో లేని పాత థియేటర్ చుట్టూ కథ సాగుతుంది కాబట్టి థియేటర్ సెట్ వేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా పది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, విలన్ గా సంజయ్ దత్ పేరు ప్రచారంలో ఉంది. అయితే, ఇతర నటీనటుల విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.