Chiranjeevi: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్... మెగాస్టార్ పై ప్రశంసల జల్లు

British Deputy High Commissioner visits Chiranjeevi Blood Bank
  • బ్లడ్ బ్యాంక్ కు వచ్చిన గారెత్ ఒవెన్
  • రక్తదానం చేసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
  • చిరంజీవిపై ప్రశంసలు కురిపించిన వైనం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022' అవార్డును అందుకున్న సందర్భంగా బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ ఓవెన్ ఈరోజు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ని సందర్శించి చిరంజీవి గారిని అభినందించారు.

ఈ సందర్భంగా ఓవెన్ మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు గెలుచుకున్నందుకు చిరంజీవి గారికి నా అభినందనలు అని వెల్లడించారు. నిత్యం వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ నిత్యం సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ చిరంజీవిని ప్రశంసించారు. అంతేకాకుండా బ్రిటన్‌ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య గొప్ప సంబంధాలను నెలకొల్పేందుకు చిరంజీవి గారితో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 ఈ సందర్భంగా గారెత్ ఓవెన్ కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ బ్రిటీష్ హైకమిషన్ బృందం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను సందర్శించడం గొప్ప గౌరవమని మరియు వేలాది మంది రక్తదానం చేసే వారికి ఇది స్ఫూర్తినిస్తుందని అన్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంచినందుకు తాను మరింత గర్వపడుతున్నానని ఆయన అన్నారు. 

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్  ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పది లక్షల యూనిట్ల రక్తదానం చేశామన్నారు. అలాగే నేత్ర బ్యాంకు వల్ల 9060 మందికి కంటి చూపునకు మార్గం సుగమమైందని అన్నారు. 32 జిల్లాల్లోని సీసీటీ ఆక్సిజన్‌ బ్యాంకుల ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్‌లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని, తెలుగు రాష్ట్రాలు కరోనా మహమ్మారి ఉన్న సమయంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించడంలో సహాయపడింది అని చిరంజీవి వివరించారు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్  సీఈవో డాక్టర్ మాధవి మాట్లాడుతూ... బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఓవెన్‌ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో బ్రిటీష్ హైకమిషన్‌తో కలిసి మరిన్ని ఉమ్మడి కార్యకలాపాలు చేసేందుకు ఎదురుచూస్తోందని ఆమె అన్నారు.

Chiranjeevi
Blood Bank
British Deputy High Commissioner

More Telugu News